పుట:Ranganatha Ramayanamu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వనములఁ బదునాల్గువర్షముల్ నన్ను - ఘనరాజ్యభోగముల్ గైకొని నిన్ను
నుండఁ గట్టడజేసె సుర్వీకుఁ డట్ల - యుండుద మిందుకు నొండాడవలదు.”
అని తెల్పుచో నంత నర్కుండు గ్రుంకె - ననుపమప్రీతిమై నారాత్రిఁ దీర్చి
మఱునాఁడు సంధ్యాసమాధు లొనర్చి - మఱి వసిష్ఠాదులు మంత్రివర్గములు
విశదంబుగాఁ బరివేష్టించి కొలువఁ - గుశపీఠమున రఘుకుంజరుఁ డుండె.
నాసభామధ్యంబునం దుండి భరతుఁ - డాసమయంబున హస్తము ల్మొగిచి
"దేవ! మీయానతి తెఱఁగున నీతి - భావించి పితృవాక్యపద్ధతిఁ బుడమిఁ
గైకొంటి నాభూమి కడపట నేను - మీ కిత్తు నందు కేమియు ననవలదు.
సర్వసర్వంసహాచక్రభారంబు - పర్వి తాల్పఁగ ఫణిపతి యోపుఁగాక!
యసల డింపక జలవ్యాళ మెట్లోపు - వసుధేశ! యే నట్టివాఁడ; బాలుఁడను.1660
ఈధారణీభార మేడ? నే నేడ? సాధురక్షణ మేడ? చర్చించి చూడ?
బాలార్కుచే నొప్పు ప్రథమాద్రియందుఁ - బోలింప మిణుగురుపురు గున్నయట్లు
శ్రీనిధి నీ వుండుసింహాసనమున - నే నుండఁగను నట్టులే భూమిప్రజకుఁ
గావున మౌనిలక్షణములు మాని - నీ వయోధ్యకు వచ్చి నీతి వహించి
యెల్లవారలకోర్కు లీడేర రాజ్య - మెల్లఁ బాలింపు మిం కేమియు ననక,
నొనరు నీ విటు చేయ నొల్లవై తేని - విను మేను నీయొద్ద విడుతుఁ బ్రాణములు;
కావున సౌమిత్రిగతి నిన్నుఁ గొలిచి - కాకుత్స్థతిలక యిక్కడ నుండువాఁడ”
నని దర్భశయనుఁడై యవనిపై నున్న - యనుజన్ము నెత్తి యిట్లనియె రాఘవుఁడు.
"ఇది యేమి భరత? నీ వి ట్లాడఁ దగునె? - మదిఁ దలపోయవో మనతండ్రియాజ్ఞ?
దశరథేశునకు మీతల్లిని మున్ను - విశదంబుగా నిచ్చువేళ మీతాత1670
నాకూఁతునకుఁ గల్గు నందను నఖిల - భూకాంతుగా నీవు పూన్పుమీ యనుచు
నమ్మిక వడసి వెన్కను బెండ్లి చేసె - నమ్మాటపట్టున నమరదైతేయ
యుద్ధంబులో విభుం డొసఁగినవరము - బుద్ధిఁ దప్పక కైక భూమీశు నడిగె.
ధారణి నీకుఁ గాంతారంబు నాకుఁ - గోరిన దశరథక్షోణిపాలకుఁడు
సత్యంబు దప్ప కీజాడ గావించె - నిత్యకీర్తులు గాంచి నెగడె నిందందు!
మనమును మనుజేంద్రుమాట పాటించి - ఘనకీర్తిసుకృతముల్ గైకొంద మెలమి;
నరుగఁడే గయ కొక్కఁడైన కన్యకను - బరఁగ దానము చేసి వఱలఁడే యొకఁడు
విడువఁడే యొకఁడైన వృషభ మటంచుఁ - గొడుకులఁ గాంచుట కోరి పితాళ్లు
ధాత్రిఁ బున్నరకసంత్రాత యౌకతనఁ - బుత్త్రుఁడై యొప్పు నీపుణ్యంబు లెఱిఁగి
యిరవందఁ దండ్రి పల్కిటు పేయకున్న - నరయఁ దండ్రులమాట లవి యెట్లు సాగు!1680
ధర "యథా రాజా తథా ప్రజా" యనెడు - నరుదారుసామెత నరుఁడు దా నరుగు
వరబుద్ధిఁ గైకొన్నవ్రతము నిండించి - యరుదెంచె దేను నీవాగ్రహం బుడుగు