పుట:Ranganatha Ramayanamu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నావసిష్ఠమునీంద్రుఁ డమలవాక్యముల - నావేళ కౌసల్య యవనినందనను
వనవాసకలిత వివర్ణాంగిఁ జూచి - తనమది విధిఁ దూఱి తద్దయుఁ బొగుల1620
గిరిమీఁద వర్తించు కిన్నరయక్ష - గరుడోరగామరకాంతలు వచ్చి
“రామునిసతి దశరథరాజుకోడ - లిమ్ముగ జనకమహీపాలుపుత్త్రి
వివిధసంకటముల వేగుచున్నదియు - భువిఁ జోద్యములు గావె పొలఁతి యీవిధికి"
నన సీతఁ బేర్కొని యారామచంద్రుఁ - డనఘుఁ డైన వసిష్ఠునడుగుల కెఱఁగి
జననులఁ జుట్టాల సచివుల హితుల - మునులను గుశపీఠముల నుండఁ బనిచి
తనతమ్ముఁడును దాను దర్భాసనములు - జనలోచనోత్పలచంద్రుఁ డై యుండె,
నావేళ భరతుని యాకృతిఁ జూచి - "యోవత్స! జడలును నురువల్కలములు
నీ వేల తాల్చెదు! నృపునాజ్ఞఁ బూని - వేవేగ జనమహీవిభుఁడ వైయుండు"
మనిపల్కుటయు రామునాననాంబుజము - గనుఁగొని భరతుండు కరములు మొగిచి
దేవ! రాఘవ! కైక ధృతి దూలి మిమ్ము - భావింపనేరక పాపంబు చేసి,1630
యడవుల నుండు పొ మ్మన్నమాటలకుఁ - దడయక చనుదేరఁ దగునయ్య? మీకు?
మిముఁ బాసి దశరథమేదినీపతియు - నమరలోకంబున కరిగె నీఘోర
పాపంబు మాతల్లి పచరించె నరక - కూపకోటుల నింకఁ గూలక యున్నె
యేను మీదగురాజ్య మిమ్ములఁ బూనఁ - గా నేర నాచేతఁ గాదు భూనాథ!
నీ వయోధ్యకు నింక నేఁడె విచ్చేసి - పావనమతితోడఁ బట్టంబుఁ బూను
వల్లభు నెడఁబాసి వగలఁ బెల్లెడలు - తల్లుల నూరార్చి తక్కినహితుల
సచివులఁ జుట్టాల సకలపౌరులను - సుచరిత్ర కృపతోడఁ జూచి పాలింపు
నన్ను నీబంటు మన్ననఁ జేసి నాదు - విన్నపం బాలింపవే దయామూర్తి!"
యని పాదముల వ్రాలి యటులేవకున్న - తనదుతముని నెత్తి తగఁగౌఁగిలించి
"భరత! నీ విది యేమి బాలుండ వైతి - కరుణఁ బల్కెదు ధర్మగతిఁ దప్పనాడి1640
యాకైక నేల పోనాడెదు? తండ్రి - పోకకు నీ వేలఁ బొగిలె దీవేళ?
ఢాకతో నదిని గాష్ఠంబు కాష్ఠంబు - జోకమైఁ బాసిన చొప్పు దీపింపఁ
బుత్త్రమిత్రకళత్రములు వాయు డాయు - మైత్రి ఋణానుసంబంధరూపములు
నవనిపైఁ బుట్టిన యప్పుడే చావు - ధ్రువము జీవున కని రూపింప నరుఁడు
తనకులోచిత మైన ధర్మమార్గమున - మనినవాఁ డిహపరమాన్యుఁ డై యుండుఁ
గావున మనతండ్రి కమనీయసత్య - భావుఁడై నీతితోఁ బ్రజలఁ బాలించి
ఘనయాగదానసత్కారముల్ పెక్కు - లొనరించి రాజ్యసౌఖ్యోన్నతి మించి
మనవంటితనయుల మనమారఁ గాంచి - జను లెల్లఁ గొనియాడ స్వర్గస్థుఁ డయ్యె
నతనికై వగచుట యనుచితం బింక - నతనివాక్యము మన మటు చేయఁ దగదు
పితృవాక్యకరణంబు ప్రియధర్మ మందు - సుతునకు నటు సేయు సుతుఁడు విశ్రుతుఁడు1650