పుట:Ranganatha Ramayanamu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దొరలు సామంతులు దుర్గాధిపతులు - నరిది కప్పము లియ్య" రని నిశ్చయించి
అలఘుమానసుఁడు జయంతుండు మొదలు - నలుగురు మంత్రుల నయబుద్ధిఁ బిలిచి
“పలువన్నెచీర లాభరణముల్ గొనుచుఁ - బొలుచు గిరివ్రజపురమున కేగి
ఈవార్త లాతని కేమియుఁ దెలుప - కావసిష్ఠుండు రమ్మనె మి మ్మటంచుఁ1310
గడువేగ భరతు నక్కడ నుండనీక - తొడుకొనిర”మ్మన్న దోరంపుఁగడఁక
వారలు హరులు దువాళిగా నెక్కి - సారె నానాపురజనపదంబులను
నదములు నదులు కాననములు గిరులు - పొదలు పెక్కులు దాఁటి పొదలినధాటి
కరము చెన్నొందఁ గేకయరాజపురికి - నరుగ వా రంత నేడవనాఁటిరాత్రి
బలమేది గోమయపంకమధ్యమునఁ - దల విరియఁగఁబోసి తండ్రి గూలుటయు
జలనిధి శూన్యమై సంపూర్ణచంద్రుఁ - డిలఁ గూలుటయుఁ బట్టపేనుంగుకొమ్ము
విఱుగుట మొదలైన విషమంపుఁగలలు - తఱుచుగాఁ గని లేచి తద్దయు భీతి
తనయిష్టసఖులతోఁ దత్ప్రకారంబు - వినుపించి వగలమై వెనుఁబడుచున్న
భరతుసన్నిధి కేగి ప్రణమిల్లి పిలిచి - కరమర్థి తమచేతి కానుక లిచ్చి
"యావసిష్ఠుఁడు కార్య మక్కడ గలిగి - దేవ! మిమ్మిట తోడి తెమ్మన్నవాఁడు1320
విచ్చేయు" మనవుడు వెస దూతచేష్ట - లచ్చుగాఁ గనుఁగొని యతిభీతి నొంది
తనమామకడ కేగి తత్ప్రకారంబు - క్రమ మొప్పఁ దెలిపి సత్కారము ల్వడసి

భరతుఁ డయోధ్యఁ బ్రవేశించుట

యతఁ డంపఁ గదలి రథారూఢుఁ డగుచుఁ - జతురంగబలములు సచివు లేతేర
నతులితచింత నేడవనాఁడు వచ్చి - యతిరయంబున నయోధ్యాపురిఁ జొచ్చి
పతి లేనిసతి నిశాపతి లేనిరాత్రి - గతి నెంతయును భోగకళలకుఁ బాసి
కన్నుల కాపురి కడు వాడుపాఱి - యున్న చందము చూచి యుల్లంబు గలఁగి
"యిది యేమి విధమొకో? యీపట్టణంబు - తుదిముట్ట శూన్యమై తోఁచుచున్నదియుఁ
బౌరులు ననుఁ జూచి బాష్పము ల్దొరుగఁ - దూఱుచు దవ్వులఁ దొలఁగి పోయెదరు.
అంగళ్ళ సకలసామగ్రివస్తువులు - పొంగార వేటికి పురములో" ననుచు
నగరివాకిట సమున్నతరథంబు డిగి - మొగి చెడి తాను దమ్ముఁడు శూన్యమైన1330
యంతఃపురంబున కరుగఁ గైకేయి - యెంతయుఁ బ్రియముతో నెదురుగా వచ్చి
కౌఁగిలించుటయును గరమర్థిఁ గైక - కవిరళభక్తితో నప్పుడు మ్రొక్కి
యిచ్చమైఁ దమమామ యిచ్చినతొడవు - లిచ్చి వారలసేమ మేర్పడఁ జెప్పి
"యెంతయు శూన్యమై యిది యేమి నగరు- వింతయై యున్నది విభవంబు దఱిఁగి
రామలక్ష్మణులకు రాజవర్యునకు - సేమమే?" యనవుడు చింతించి కైక
భరతునిఁ జూచి సంభ్రమము రెట్టింప - దరహాసవదనయై తగవేది పలికె.