పుట:Ranganatha Ramayanamu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“యేను నిద్రాదేవి యేర్పడఁ దెల్పు - మా నాకు నింకెట్లు మానాఢ్య! యంత
విధి విధించెను వెంట వెంట వర్తింప - విధ మేది? నిన్నునే విడుచుట కింక!"
అనిన "నూర్మిళయందు నహరహంబులును - జనియుండు మంత నీసమయంబు దీర్చి
వచ్చినఁ గైకొందు వరుస ని" న్ననిన - నిచ్చ నౌఁగా కంచు నేగె నిద్రయును;
అలరుచు నీదేవతానుగ్రహంబు - గలిగె నా కనుచు లక్ష్మణదేవుఁ డుండె.
సుకుమారతారుణ్యశోభనాకృతులు - ప్రకటితధైర్యసంపన్ను లైయున్న1000
నారామసీత లత్యంతదుఃఖములఁ - గూరెడుతెఱఁ గెల్ల గుహునకుఁ జెప్పి
హంసతూలికశయ్యయం దుండుభోగి - పాంసుపల్లవములఁ బవళించి యిపుడు
కఱకురా ళ్లొత్తంగఁ గళవళపడుచు - గురువెట్టి నిద్రచేఁ గూర్కియున్నాఁడు
అడరి కౌసల్యయు నాసుమిత్రయును - బడియెడిశోకంబు పలుమాఱుఁ జెప్పి
సొరిది నిద్దఱుఁ గూడి శోకించుచుండ - నరుణోదయం బయ్యె; నంత రాఘవుఁడు
నేమంబు లన్నియు నిష్ఠతోఁ దీర్చి - సేమ మేర్పడ గుహుచే మఱ్ఱిపాలు
దెప్పించి కోమలదీర్ఘ కేశముల - విప్పి యావైదేహి వివశయై తూల
ఆమఱ్ఱిపాలచే నందందఁ దడిపి - సౌమిత్రియును దాను జడ లొప్పఁ దాల్చి
ఘనుఁడు రాఘవుఁడు వైఖానసవృత్తి - ననుజుండు దాను పాయనినిష్ఠఁ బూని
అనఘ సుమంతు రమ్మని చేరఁ బిలిచి - “తనరార రథ మెక్కఁ దగదు మా కింక!1010
నరదంబు గొని యయోధ్యకు నీవు వేగ - మరలిపొ మ్మధిపు నెమ్మది గొల్చియుండు,
పార్థివేశ్వరునకుఁ బరఁగఁ దల్లులకు - నర్థితో మ్రొక్కితి మని చెప్పు” మనుఁడు
యేమిటి కీమాట లిటమీఁద ననుచు - సౌమిత్రి యధికరోషమున నిట్లనియె.
భూమీశుఁ డాలిపంపున నీతిమాలి - యేమియుఁ బరికింప కిటు చేసె మమ్ము
తనయాలు దానును దనకూర్మికొడుకు - ఘనరాజ్యభోగముల్ గైకొనుఁ గాక!
యని యేను బల్కితి" నని చెప్పు మీవు - చను మన విని రామచంద్రుండు గినిసి
"మాను సౌమిత్రి!” “సుమంత నీ వింక - భూనాథుతో నీవు పుట్టింపవలదు
ఆనృపుఁ డిది విన్న నధికదీనాయ - మానమానసుఁడునై మఱి పొక్కకున్నె?"
యనిన సుమంతుఁ డత్యంతశోకమున - మునిఁగి భీతిల్లి రామునిఁ జూచి పలికెఁ;
"గానల మిముఁ ద్రోచి కడుదీనవృత్తి - నే నయోధ్యాపురం బేమని చొత్తు?1020
నేమని చెప్పుదు నీవార్తఁ బ్రజకు? - నేమని కొనిపోదు నీశూన్యరథము?
నేమని కౌసల్య నే నూఱడింతు? నేమని కైకమో మేను వీక్షింతు?
వనముల కేనును వత్తును గాక" యనిన రాముఁడు నవ్వి యాతనిఁ జూచి
"కడఁకతో నేము గంగానది దాఁటి - యడవులఁ జొచ్చితి మనువార్త కైక
నీవు చెప్పినఁ గాని నిజముగాఁ గొనదు - నీవు శోకింపక నెమ్మదిఁ బొమ్ము,
నామాఱుగా నీవు నయవాక్యసరణి - వేమాఱు దెల్పి భూవిభుఁ గొల్చి యుండు"