పుట:Ranganatha Ramayanamu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరాము దీవించి సీత దీవించి - ధారుణిపతిసేఁత తలపోసి వగచి
మెలపొంద నపుడు సుమిత్ర లక్ష్మణుని - బిలిచి యింపార గంభీరోక్తిఁ బలికె.
"రాముని దశరథరాజుగాఁ జూడు - భూమిజ నన్నుఁగా బుద్ధిఁ జింతింపు
మడవి నయోధ్యగా నాత్మలోఁ దలఁపు - కడుభక్తియుక్తి రాఘవుఁ గొల్చియుండు,
మాయతజయసిద్ధి నభివృద్ధిఁ బొందు - పోయి రమ్మని ప్రీతిఁ బుత్త్రు దీవించె.
రామచంద్రునిఁ జూచి 'రఘువీర నీకు - సేమంబు దలఁచి నీచిత్తంబులోన
నరలేనిసఖుఁ డన్న ననుజన్ముఁ డన్న - నెరయ నీతఁడె కాక నిక్కువం బరయ
నటుగాన లక్ష్మణు నరసి రక్షింపు - మడవులలో" నన్న నౌఁగాక యనుచు
రాముఁ డాదశరథరాజు నీక్షించి - యామహితాత్ముతో నచలుఁడై పలికెఁ.
‘‘బదునాలుగేండ్లును బ్రకటదుర్గములఁ - బదునాల్గుదినములపగిది వర్తించి
ధరణీశ! వత్తు సంతాపింపవలదు - భరతుండు నాకంటె భక్తుండు మీకు880
నతనిఁ బట్టము గట్టుఁ డాత్మఁ గైకేయి - కృతకంబులకు నింకఁ గింకిరిపడకు.
మాతల్లి నీకు నెమ్మది సేవ సేయు - నాతల్లి మీరు న న్నరయుఁడు ప్రేమ”
నని ప్రదక్షిణముగా ననుజుండుఁ దాను - జనకజయును గడు సద్భక్తి మ్రొక్కి
రప్పుడు రఘురాముఁ డడవికిఁ బూని - దప్పక వెడలె నాదశరథాధిపుఁడు
మదిలోనఁ దలఁచి సుమంత్రునిఁ జూచి - “యదె రాముఁ డడవుల కరుగుచున్నాఁడు
గొనిపొమ్ము రథ” మన్నఁ గువలయాధిపుని - పనుపునఁ గొనిపోయి భక్తితో మ్రొక్కి
‘‘రథ మిదె పుత్తెంచె రాజు మీకర్థి - రథ మెక్కి వేంచేయు రఘురామచంద్ర!”
యనవుడు దశరథునాజ్ఞకు వెఱచి - మును సీత నెక్కించి మొగి నాయుధమును
తనరు జోడును బెట్టి తాను లక్ష్మణుఁడు - ఘన మైనరథ మెక్కి కదలె రాఘవుఁడు
అంతఁ బౌరులు వృద్ధు లాప్తులు మంత్రు - లింతులు పౌరులు హితులు నాశ్రితులు890
వంత బ్రాహ్మణరాజవైశ్యశూద్రులును - అంతంత నలుగడ నడలుచు వెడలి
ముందట నిరుపార్శ్వములఁ బిఱుందటను - సందడించుడు మది జడిగొన్న వగల
నరనాథపుత్త్రుఁ డెన్నఁడు గానరాఁడు - సురుచిరస్థితి నేఁడు చూత మింపారఁ
జంద్రుతేజము నవ్వఁజాలు నీరామ - చంద్రు మోములఁ జూడఁ జనుదెంచువారు;
కడఁగి యిక్ష్వాకుల గౌరవం బెల్ల - నడఁచెనే మంథర యని తిట్టువారు;
తగ వేది రఘురాముఁ దపసిగాఁ జేయ - నగు నమ్మ! కైకేయి కని దూఱువారు;
దాలిమి దిగనాడి దశరథాధీశుఁ - డాలికి వెఱచునే? యని రోయువారు
జను వెల్లఁ జెడి రామసౌమిత్రు లంత - ననదలై పోదురె? యని వేగువారు;
పనిగొని తమతండ్రిపనుపునఁ గాని - పొనుపడి యిట్లేల పోదు రన్వారు;
ఈపదునాలుగేం డ్లెట్లు వీ రడవి - నాపద వేగింతు రని పొక్కువారు;900
ఈనోము నోచెనో యిమ్మహీపుత్రి - తా నంచు మదిలోనఁ దలపోయువారు;