పుట:Ranganatha Ramayanamu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తల్లుల లిడ్డల దయమాలి పాప - నుల్లంబులోపల నోర్వంగఁ గలనె?
కైకమాటకు నిన్నుఁ గాంతారభూమిఁ - బైకొని యదయతఁ బడ నేఁగుమంటి;840
హాపుత్ర! హారామ!" యనుచు మూర్ఛిల్లి - భూపాలుఁ డప్పుడు బోధింపఁ దెలిసి
వారక పదునాల్గువత్సరంబులకు నారఁగఁ బరిపూర్ణ మగునట్లు గాఁగ
మెచ్చినతొడవులు మేలువస్త్రములు - నచ్చుగా జానకి కవనీవిభుండు
వలనొప్పఁగాఁ దెచ్చి వరుస నిప్పించె - వలువలు గట్టి యావరభూషణములు

కౌసల్య సీతకు పతిధర్మము దెల్పుట

దనరంగ జానకి ధరియించె నంత - జనకజఁ జూచి కౌసల్య శోకించి
"యడరంగ నితఁడు మహాచక్రవర్తి - కొడుకని మీతండ్రి కోరి ని న్నిచ్చెఁ
గడుకొని దైవయోగంబునఁ జేసి - కడపట మఱి యిట్టి గతి యయ్యె నేఁడు;
తాపసవృత్తిమైఁ దగిలి కానలకు - నీపతితోఁ గూడి నీ కేగవలసె;
దీనికి వగవకు; తివిరి రాఘవుఁడు - ఈనిఖిలోర్వియు నేలెడి మగుడి;
పతి పేదవాఁ డైనఁ బాయంగరాదు - సతులకు నిదియు విచారించి నడువు850
చేకొని పతిపంపు సేయు పత్నులకుఁ - గైకొను నుభయలోకములందు శుభము"
ననఁగను కౌసల్య నాసీత చూచి - వినుతంబుగాఁ బల్కె వినయంబుతోడ
“అనుకూలనై పతి నతిభక్తిఁ గొలిచి - తనర వర్తించెద ధర్మమార్గమున
మానుగాఁ బతిలేని మగువ చక్రంబు - లేనితేరును తంత్రి లేని వీణెయును
బోలెఁ బుత్త్రులుగల పుణ్యురా లైన - జాలంగఁ గొఱఁగాకఁ జను నట్లుగానఁ
బతికిఁ బ్రియంబును బ్రాణంబు లైన - హితబుద్ధి వంచింప కిత్తు నే" ననిన
నాదేవి వైదేహి నలరారఁ జూచి - “భూదేవిపుత్త్రివై పుట్టిననీవు
నీగుణంబులు తగు నెలమి లక్ష్మణుని - నీగుణోజ్వలురాము హితుని మన్నింపు"
మనిన సీతాదేవి యౌఁగాక యనుచుఁ - దనకు మ్రొక్కిన నెత్తి తగఁ గౌఁగిలించి860
దీవించె నప్పుడు తెఱఁగొప్ప రామ - దేవునితోడ నా దేవి యిట్లనియెఁ.
“బృథులాటవులయందుఁ బృథివీశపుత్రః! - మిథిలేంద్రసుతను సౌమిత్రి నేమరకు,”
మనిన “మీయానతి నది వింటి జనని! - యొనర నాదక్షిణభుజము లక్ష్మణుఁడు
నానడ జానకి నాకు నెబ్భంగి - మానసంబున వీరి మఱువంగ నగునె?
యేను విల్లందిన నెందు నేభయము - గా నేల వచ్చు? ముక్కంటి పైఁబడిన
నదిగాన నీవింక నడలకు మాకు - వదలను ధర్మంబు వగవంగ నీకు
భూనాథునకుఁ గరాంబుజములు మొగిచి - తాము సీతయు సుమిత్రానందనుండు
అమ్మలు దీవింపుఁ డందఱు" ననుచు - నిమ్ముల మున్నూటయేఁబండ్రులకును
సరి ప్రదక్షిణముగాఁ జనుదెంచి మనసు - లెరియంగ నాతల్లు లెల్ల శోకింప
వినుచు సుమిత్రకు వినతులై; రంత - కనుఁగొని యద్దేవి కౌఁగిటఁ జేర్చి870