పుట:Ranganatha Ramayanamu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజపత్నులయొద్ద రఘురామునాజ్ఞ - నీజనకజ నుండని మ్మట్లుకాఁగ
వల దన నేల యీవైదేహి చనఁగఁ - గలయఁ బౌరులతోడఁ గాననంబులకు
నేమును జనువార మింతియే కాదు - రామచంద్రునిఁ గొల్వ రమణీయలీల
భరతశతుఘ్నులు బలసివచ్చెదరు - పరికింప నీవు నీపాడూఱ నుండు810
పోవంగ రాముఁడు పుణ్యశీలుండు - లీల నున్నది యూఱు లేనిది పాడు
పతి నిటు వంచించి పాపంబు దలఁచి - యతిలోభమున రాము నడవుల కనిచి
భరతు నయోధ్యకుఁ బట్టంబు గట్టి - చిరలీల రాజ్యంబు సేయఁజూచెదవు
పతియాజ్ఞ దప్పఁడు భరతుండు తండ్రి - ప్రతినిధి నారామభద్రునిఁ జూచు
నీమాట విని ధర నిష్ఠఁ బోవిడిచి - రాము నడచి యీరాజ్యంబుఁ గొన్న
దలపోసి చూడఁగ దశరథేంద్రునకు - పొలుపార నతఁడు తాఁ బుట్టె నేమైన
నీతప్పు నీమీఁద నెరపిన మీఁద - మాతగాఁ దలఁచునే మదిలోన నిన్నుఁ
గర మర్థి రాముఁ డాకాన వర్తింప - భరతుఁ డీసామ్రాజ్యభార మె ట్లోపు?
నెఱుఁగవు భరతునిహృదయ మేమియును - మఱి యీతెఱఁగు విన్న మండు నీమీఁద
నెవ్వరికై నీకు నీనిష్ఠురంబు - నివ్వెంట భరతున కియ్యకో లగునె?820
కావున నిది మేలుగా నెన్నవలదు - నీ వదియునుగాక నిష్ఠురవృత్తి
శ్రీరామునకు మఱి సీతకు నార - చీర లిచ్చుటకు నీచేతు లెట్లాడె
నారచీరలు మాని నవరత్నఖచిత - చారుభూషణములు సరసంబులైన
చీనాంబరంబులు చెలువారఁ బూని - జానకి దనపరిచారకుల్ గొలువఁ
జనుఁగాక!” యనుడు నాసంయమీశ్వరుఁడు - వినుతభూషాంబరవితతు లిచ్చుటయు
ననయంబు మదిలోన హర్ష ముప్పొంగఁ - గొని యవి ధరియించె గురునియానతిని
సీత యప్పుడు నారచీరలు మాని - యాతతప్రీతితో నట్లున్నఁ జూచి
కైక నందఱుఁ దిట్టఁగా రాజు వినుచు - నాకాంతదెసఁ జూచి యలుకతోఁ బలికె;
“తక్కక పాపంబు తలఁచి రామునకు - నక్కటా! వనవాస మడిగితి కాక830
మేదినీసుతయు సౌమిత్రియు నార - లాదరంబునఁ గట్ట నడిగితే నన్ను?
నీమానవతి సీత యింతకుఁ దగునె - యేమి చేసితి నీకు నీతెంపు సేయ?
రాముని వినయాభిరాముఁ గాంతార - భూమికిఁ దపసియై పొమ్మనుకంటె
మఱియొండుపాపంబు మదిలోనఁ గలదె? - తరమఁజేసియు నేల తండారవైతి?
పాపజాతికి నీకుఁ బతియైన నాకుఁ - బాపంబు కడమౌనె పరికింప” ననఁగ
నామాట విని రాముఁ డధిపుతో ననియె - "భూమీశ! నను బాసి పొదలు శోకమున
మాతల్లి కౌసల్య మదిఁ గుందకుండ- భాతిగాఁ గృప మీరు పరఁగ రక్షింపుఁ"
డనుడు నాదశరథుఁ డావాక్యములకుఁ - దనరారు శోకాగ్నిఁ దనచిత్త మెరియ
“నెట్టిపాపము తొల్లి యేఁ జేసినాఁడఁ - బట్టి నా కనుభవింపక పోదు నేఁడు