పుట:Ranganatha Ramayanamu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నది యిది యేల నీ వావధూమణికి - నొదుఁగుచు దాసివై యుండంగవలయు.
భరతుండు నారఘుపతికి భీతిలుచు - వెఱవున భృత్యుఁడై విహరింపవలయు150
రాజదేవి యటంచు రమణి సీతకును - నీచిన్నికోడ లెన్నికఁ గొల్వవలయు
నెలఁత యిట్టిద యేని నీ కేటి బ్రతుకు - కల దుపాయం బిది కార్యంబునకును
వనదుర్గముల రాము వసియింపఁ బనుపు - పనివడి భరతునిఁ బట్టంబు గట్టు”
మనవుడు కైకేయి “యక్కట! నాకు - జననాథుఁ డింతటి చను విచ్చెనేని?
ఆరాజు నేమని యడుగుదు దీని - నీ రెండు దశరథుఁ డేల నా కిచ్చు?
నెక్కడిమాట నీ వేమి చెప్పినను - నిక్కార్యఘటన నా కేరీతిఁ బొసఁగు
శ్రీరాము నడవులఁ జేరఁ బొమ్మనుచు - నేరీతిఁ జెప్పుదు నెలనాఁగ నేను"
ననుచున్న కైకతో నాయుపాయంబు - తనకీడు మెఱయ మంథర చెప్పఁ దొడఁగె.
“బడఁతుక! తొల్లి శంబరుఁడు నింద్రుండు - దొడరి పోరాడ నింద్రునకు నై ప్రీతి
నినుఁ దోడుకొని సైన్యనివహంబు దాను - జని రాత్రి మార్కొన్న శంబరుతోడఁ160
బోరాడ దశరథభూపాలుమీఁద - నారాక్షసుఁడు మాయ లలుకఁ బన్నుటయు
ధవళాంగుఁ డనుమునిదయ నీవు గన్న - నవిరళం బగుమాయ నామాయ లడఁచి
నీవిభు నాదైత్యు నిశితాస్త్రనిహతిఁ - జావకుండఁగఁ గాచి సంప్రీతుఁ జేసి
వసుధేశుచే రెండువరములు నాఁడు - మసలక వడసితి మఱచితే వాని?
ఈవె నా కీకథ లెఱిఁగించి మఱియు - నీ వాత్మ మఱచిన నే నేల మఱతుఁ?
బట్టంబు నెడఁబాసి పదునాలుగేండ్లు - గట్టిగా మునివృత్తిఁ గౌసల్యకొడుకు
దారుణకాంతారధరణి యేలుటకు - ధారుణీతలము నీతనయుఁ డేలుటకు
నారెండువరములు నవనీశు నడిగి - యీరెండుతెఱఁగుల నిటు సేయఁ బనుపు.
మడుగుచో నతఁ డెంత ప్రార్థించెనేని? - జడమతితోఁ గాక సత్యంబు మోపి,
విడువక నీకార్యవిధము సాధింపు - తోడిన కార్యంబు దొఱుకు నెల్లెడలఁ170
బతి బొంకవెఱచు; నీపై నెయ్య మెక్కు; - డతకరింపఁడు సేయు" మనిన రాగిల్లి
"నీవంటిప్రియురాలి నీవంటిసఖిని - నీవంటినయగుణనిధి నెందుఁ గాన?
నీవు నాచే విన్న యీవరద్వయము - గౌరవంబునఁ జేయఁగా వరారోహ!
ఈవెంచినటువలె నీభూమి కెల్ల - నావరతనయుండు నాయకుండైన;
బాగుగా నపరంజి బంగారుచేత - నీగూను పొదిగించి నీముఖేందువునఁ
దిలకంబు కస్తూరి దిద్ది నీమేను - వలనొప్ప భూషణావళులు గైసేసి
నటియించు మరుని యందపుఁ గొమ్మ యనఁగఁ - గుటిలకుంతల! నీవు గ్రుమ్మరుచుండ
సఖు లెల్ల నీమాట జవదాటకుండ - సఖియ ని న్నలరింతు సతత మే" ననుచుఁ
గైక మంథరకు సత్కారముల్ చేసి - యేకాంతమునఁ దనయింటికిఁ బోయి
పెట్టిన సొమ్ములు పెట్టెలోఁ బెట్టి - దట్టమౌ కస్తూరి తలపట్టు పెట్టి180