పుట:Ranganatha Ramayanamu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రవిమలమృదులతల్పంబుపై వేడ్కఁ - బవళించియున్న యప్పద్మాక్షిఁ జూచి
“లెమ్ము; లెమ్మోభామ! లీలాభిరామ! - ఇమ్మెఱుంగవు కార్య మేమియు" ననుచుఁ
గొన రెట్టఁ బట్టి గ్రక్కున లేవనెత్తి - తననేర్పుమాటలఁ దరుణి కిట్లనియె.
“వసుధాధిపతి నాకు వలచు నాభాగ్య - మసమాన మని చెప్పు టది బొంకులయ్యె120
నది యెట్టు లను; పెద్దయాలికి వెఱచి - మదిరాక్షి! నిను వేఁడ మఱి మోసపుచ్చి
భరతుని నొకవంకఁ బరభూమిఁ బంచి - పరికింప రఘురాముఁ బట్టంబు గట్టఁ
దలఁచుచునున్నాఁడు దశరథేశ్వరుఁడు; - నెలఁత! యిట్టిదియైన నీ కేటి బ్రతుకు?
రాజుల మది నమ్మరాదు నీ కేల - వేజాడలను విఱ్ఱవీగెదో బాల!
యిట్టిమోహవిదూరు నిట్టివంచకుని - నిట్టిబూమెలవాని నెందు నేఁ గాన
మగఁడె యాతఁడు మైత్రి మానిన యట్టి - పగవాఁడు గాక యీపట్టుల నీకు
సవతికుమారుని జగతియంతటికి - ధవునిగాఁ జేసిన ధవళాయతాక్షి!
నీకుమారునకును నీకును నాకు - శోక మబ్బుటకాక సుఖ మేలు కలుగు
నీ కరణంబుగా నీతండ్రి యనుపఁ - జేకొన్న ప్రేమ వచ్చినదాన నేను;
నీలెస్స నా లెస్స నీకైనలేమి - నాలేమి గాన నానావిధంబులను130
హితవుఁ జెప్పితి నీకు నిందునిభాస్య - మతి నీదుపుత్రుండు మనుట దలంపు”
మనుట వేడుకఁ బూని యాకైక దాని - వినుతించి కౌఁగిట వేగంబ చేర్చి
"శ్రీరామపట్టాభిషేకోత్సవంబు - చేరి నా కెఱిఁగించి చెవులకు విందు
చేసితి వేమందుఁ? జెలువ నీపొందు - వాసిగా ఫలియించె వక్రోక్తు లుడుగు,
భరతునకంటె నాభరతాగ్రజుండు - తిరమైన భక్తివిధేయుండు నాకు
నీమేలువార్తకు నేను మెచ్చితిని - భామరో!" యనుచు నేర్పడఁ గొంతసొమ్ము
ఘనతరనవరత్నఖచిత మై యొప్పు - తనచేతికడియంబు దానికి వేగ
కొమ్ము కొమ్మని యొసఁగుటయు నాసొమ్ము - లమ్మాయలాఁడి యల్లటు పాఱవైచి
పాపంబు హృదయతాపంబు కోపంబు - దీపింపఁ బలికె నత్తెఱవతో మఱియు
"నిది మేలుగా నుబ్బి తిచ్చలో నిప్పు - డిది యేమి మెచ్చుగా నిచ్చితి నాకు!140
నిది యేమి కైక? యీహితవుఁ గైకొనక - వదరి పల్కితి నీతి భావింపలేక
వలనొప్ప నే మనవచ్చు నీగుణము - కలకాల మీతీరుగాఁ జనఁ దొడఁగెఁ
దన్నుమాలినయట్టి ధర్మంబు గలదె - కన్నుఁ బోయెడునట్టి కాటుక గలదె?
జగతిలో నెందైన సవతినందనుల - కగపడు శుభముల కాత్మఁ గోరుదురె?
సవతికుమారుండు సామ్రాజ్యమునకు - ధవుఁడైన సకలభూధవులు బాంధవులు
ప్రజలు మంత్రులు రాము పంపు సేయుదురు - గజహయాదిబలంబు కైవశంబగును
దశరథునకు స్వతంత్రము లేదు పిదప - శశిముఖియైన కౌసల్య సంపదల
విఱ్ఱవీగఁగ సరివెలఁదివై యుండి - వెఱ్ఱిదానవె యెట్లు వేగించె దీవు?