పుట:Ranganatha Ramayanamu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యమ్మూఁడువాకిండ్లయందాఁకఁ బోవ - నిమ్ముల రాఘవుం డెదురేగుఁదెంచి
యవతీర్ణరథునికి నతిభక్తి మ్రొక్కి - సవినయంబుగ సంతసంబున నపుడు
లోనికిఁ దెచ్చి యాలోకవంద్యునకు - మానుగ సత్కృతుల్ మనసారఁ జేయఁ
బుణ్యాహవాచనంబులు నుపవాస - పుణ్యసంకల్పంబు పొసఁగఁ జేయించి
వెలయ రాముఁడు పదివేలధేనువుల - నెలమి దక్షిణ గాఁగ నిచ్చినఁ గొనుచు90
వచ్చి వసిష్ఠుఁడు వసుమతీపతికి - నచ్చుగాఁ జెప్పి గృహంబున కరుగ
నంతఃపురంబున కరిగె భూవిభుఁడు - నంత నక్కడ రాముఁ డానంద మంద
జానకితోఁ గృతస్నానుఁడై విష్ణు - మానుగాఁ గూర్చి హోమంబుఁ గావించి
యాహవిశ్శేషంబు నమరఁ బ్రాసించి - యూహ విష్ణుధ్యాన మొనరఁ జేయుచును
విశదనిశ్చయబుద్ధి విష్ణుగేహమునఁ - గుశశయ్యపైఁ బొల్చి కులగురుండైన
యావసిష్ఠుఁడు చెప్పినట్టిచందమున - ధీవరిష్ఠుఁడు రామదేవుండు నిష్ఠ
నుపవాస ముండె; నయోధ్యలో నంత - విపులసమ్మదమున విలసిల్లువారు;
కొలఁదిముత్యముల మ్రుగ్గులు పెట్టువారు - చెలువార గృహములఁ జిత్రించువారు
కలయఁ గస్తూరిరేఖలు దీర్పువారు - నలి మీఱి మణితోరణము లెత్తువారు
విరులచప్పరములు విరచించువారు - పురవీథిఁ గేతనంబులు నిల్పువారు100
కలవడంబులు మేలుగాఁ గట్టువారు - కలిమి నొండొరు లర్థిఁ గైసేయువారు
నభిషేకసుముహూర్త మలరించువారు - విభుఁడైన దశరథు వినుతించువారు
నిలువేల్పులకుఁ బూజ లిచ్చెడువారు - కల కొద్దిదానము ల్గావించువారు
పురరాజవీథి గుంపులు గూడువారు - సరసకథాగోష్ఠి సలిపెడువారు
రాముఁడే రాజుగాఁ బ్రార్థించువారు - రాముని గొలువ సంభ్రమపడువారు
రామకీర్తనముల రాజిల్లువారు - నై మహోత్సవకోటు లటుచేయుచుండ
నప్పుడు మందర యనుకైకదాసి - తప్పక దనమేడఁ దా నెక్కి చూచి
యిది యేమి చందమో యీపురలక్ష్మి - పొదలుచున్నది మహాద్భుతవైభవములఁ

మందర కైకకు దుర్బోధ చేయుట

బౌరు లందఱును నపారశృంగార - చారుశరీరులై సంతసించెదరు
కౌసల్యనగరిలోఁ గలకాంతలెల్ల - గైసేసియున్నారు కడువేడ్కతోడ110
నేలొకో కౌసల్య యెద నుబ్బియుబ్బి - వేలసంఖ్యధనంబు వెచ్చపెట్టెడిని
ననుచుఁ బ్రమోదాది యగురాముదాది - కనుఁగొని యడిగి యక్కామినివలన
రాముఁ బట్టము గట్టి రాజు గావించు - నామహోత్సవకోటు లని నిశ్చయించి
పనివడి రాముఁడు బాల్యంబునందుఁ - దనకాలు విఱిచిన తప్పు సాధింప
నిది నాకు తఱి యని యిచ్చఁ జింతించి - యది వచ్చి కైకతో నంతయుఁ జెప్ప
వచ్చి తత్కేళీనివాసంబుఁ జొచ్చి - మచ్చిక నుయ్యెలమంచంబుమీఁదఁ