పుట:Ramanujan Nundi Etu Atu by Vemuri Venkateswararao.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థానాలు మించి వాడవలసిన అవసరం రాదు. కాని కలన యంత్రాలు వాడుకలోకి వచ్చిన తరువాత π విలువని 10,000 బిలియను దశాంశ స్థానాలు దాటి కూడ లెక్క కట్టి చూసేరు. ఎందుకుట?

పై ప్రశ్నకి ఒకటి కంటె ఎక్కువ సమాధానాలే ఇవ్వ వచ్చు. ఒకటి, కలన యంత్రాలు, అవి వాడే గణన పద్ధతులు (algorithms) ఎంత సమర్ధవంతంగా పని చేస్తున్నాయో తెలుసుకోడానికి π విలువ కట్టడమనేది ఒక అగ్ని పరీక్షలా వాడతారు. రెండు, π విలువ కట్టడం లో ఖచ్చితతత్త్వం పెరిగే కొద్దీ ఆ విలువ చేత ప్రభావితమైన సంఖ్యా గణితం (number theory) లో లోతుకి దిగడానికి సావకాశాలు పెరుగుతాయి. మూడు, అన్నిటి కంటె ముఖ్యమైన కారణం – పరిష్కారం లేకుండా సమశ్య ఉండిపోతే మానవుడి మేధకి ఒకటే దురద! ఇంతవరకు ఎవ్వరు అధిరోహించని శిఖరం ఉంటే దానిని ఎక్కాలి అన్న కోరిక ఉన్నట్లే, π విలువని ఎవ్వరు ఎక్కువ దశాంశ స్థానాల వరకు కట్టగలరన్నది ఒక సవాలు! అంతే!!

అంతే కాకుండా, ఇంతవరకు π గురించి మనకి తెలియని విషయాలు, తెలుసుకోవలసిన విషయాలు, ప్రహేళికలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి పూర్ణ సంఖ్యల మీద కేవలం అంకగణిత పరికర్తలు (arithmetic operators) - అనగా కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగారాలు, వర్గమూలాలు - మాత్రమే ఉపయోగించి π విలువ కట్టడం సాధ్యం కాదని మనకి తెలుసు. అంతే కాకుండా, π లో నిరంతరాయంగా వచ్చే అంకెలలో ఎప్పటికీ ఒక బాణీ అంటూ కనిపించదని అనుకుంటున్నాము కానీ, ఈ విషయం ఎవ్వరు ఇంతవరకు ఋజువు చెయ్యలేదు. (బిలియనుల పైబడి పరిశీలించిన దశాంశ స్థానాలలో ఇంతవరకు ఏ రకం బాణీ కనిపించ లేదు. ఇటు పైన కూడ అటువంటి బాణీ లేకుండా ఉంటుందని భరోసా ఏదీ?). ఇదివరలో మనవి చేసినట్లు, వృత్తంతో ఏ విధమైన సంబంధంలేని సందర్భాలలో కూడ π తరచు తారసపడుతూ ఉంటుంది. ఉదాహరణకి పూర్ణ సంఖ్యలలో ఏదో ఒక దానిని యధాలాపంగా ఎన్నుకుని ఆ సంఖ్యయొక్క ప్రధాన భాజకాలలో పునరుక్తి లేకుండా ఉన్న సంఘటన యొక్క సంభావ్యత లెక్క కడితే అది 6/π2 అని సమాధానం వస్తుంది. ఈ సందర్భంలో π కనబడవలసిన అవసరం లేదు. కాని కనబడింది! ఎందువల్ల? రెండున్నర సహస్రాబ్దాల నుండి π మీద ఆసక్తి తగ్గకుండా నిలవడానికి ఇవి కొన్ని కారణాలు.