పుట:Ramanujan Nundi Etu Atu by Vemuri Venkateswararao.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(5) ఒక ప్రధాన సంఖ్యలో ఉన్న అంకెలని ఏ విధంగా అమర్చినా తిరిగి ప్రధాన సంఖ్యే వస్తే వాటిని నిరపేక్ష (absolute) ప్రధాన సంఖ్యలు అంటారు. ఉదా: 199, 919, 991. వెయ్యి లోపున 21 నిరపేక్ష ప్రధాన సంఖ్యలు ఉన్నాయి: 2, 3, 5, 7, 11, 13, 17, 31, 37, 71, 73, 79, 97, వగైరా. మిగిలిన తొమ్మిదింటిని మీరు కనుక్కొండి.

(6) కచిక (palindrome) ప్రధాన సంఖ్యకి ఒక ఉదాహరణ: 700666007. ఇది ఎటు నుండి చదివినా ప్రధాన సంఖ్యే! మధ్యలో 666 ఉండడం వల్ల దీనిని "సైతాను" (beastly) ప్రధాన సంఖ్య అని కూడ అంటారు. (క్రైస్తవ మతంలో సైతానుని 666 తో సూచిస్తారు.)

(7) ఒక సంఖ్యలో అంకెలని గుండ్రంగా చక్రంలా అమర్చిన తరువాత ఎక్కడనుండి చదివినా ప్రధాన సంఖ్యే వస్తే దానిని చక్రీయ (cyclic) ప్రధాన సంఖ్య అంటారు. ఉదా: 1193, 1931, 9311, 3119 అనేవి నాలుగంకెల చక్రీయ ప్రధాన సంఖ్యలు.

(8) ఒక సంఖ్యలో అన్నీ గుండ్రటి ఒంపు తిరిగిన అంకెలు (అనగా 0, 3, 6, 9) మాత్రమే ఉంటే దానిని ఒంపుల ప్రధాన సంఖ్య (curved-digit prime) అంటారు.

(9) ఒక ప్రధాన సంఖ్యలో అంకెలని ఒకటీ, ఒకటీ మినహాయించుకుంటూ పోతూన్నప్పుడు మిగిలినది ప్రధాన సంఖ్యే అయితే దానిని "మినహాయింపు" (deletable) ప్రధాన సంఖ్య అంటారు. ఉదా: 1997. ఎడమ పక్క నుండి వరుసగా 1, 9, 9 మినహాయించగా మిగిలిన 997, 97, 7 ప్రధాన సంఖ్యలు.

(10) "క్యూబన్" (Cuban) ప్రధాన సంఖ్యలకీ, క్యూబా దేశానికి ఏ విధమైన సంబంధము లేదు. ఇక్కడ "క్యూబన్" అంటే "క్యూబ్" (cube) కి సంబంధించిన అని అర్థం. వీటిని మనం “ఘన ప్రధాన సంఖ్యలు” లేదా ఘనాపాటీలు అనో అనొచ్చు.