పుట:Ramanujan Nundi Etu Atu by Vemuri Venkateswararao.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ నేపధ్యంలో ఆర్యభట్టీయం లోని పన్నెండవ శ్లోకాన్ని కొంచెం పరిశీలిద్దాం:

మఖీ భఖీ ఫఖీ ధఖీ ణఖీ ఙఖీ
ణఖీ హస్ఝ స్కకీ కిష్గ ఘకీ కిఘ్వ
ఘ్లకీ కిగ్ర హక్య ధకీ కిచ
స్గష్జ ణ్వ క్ల ప్త ఫ చ కళార్ధ జ్యా

ఈ శ్లోకంలో ఆఖరి పదం ఒక్కటే సంస్కృతం; మిగిలిన 24 పదాలూ 24 శబ్ద సముదాయాలు. వాటికి భాషలో అర్ధం లేదు. వీటిలో ప్రతి శబ్ద సముదాయమూ ఒక అంకెని కాని, సంఖ్యని కాని సూచిస్తుంది. ఈ అంకెలన్నీ ‘జ్యా’ అనే రేఖాగణిత భావాన్ని నిర్వచించటానికి ఉపయోగపడతాయి. మనం ఈ రోజులలో త్రిగుణమాత్రుకం (trigonometry) లో వాడే ‘సైన్’ (sine) యొక్క నిర్వచనం ఈ శ్లోకంలో గూఢమైన పద్ధతిలో నిబిడీకృతమై ఉంది. ఈ పద్ధతి కూడ ఆర్యభట్టే ప్రవేశపెట్టి ఉండొచ్చు. ఈ శ్లోకం అర్ధం చేసుకోవాలంటే కొంచెం శ్రమ పడాలి.

6.1 కటపయాది సూత్రం

తెలుగు లోనూ, సంస్కృతం లోనూ 25 హల్లులని ఐదు వర్గాలుగా విడగొట్టి రాస్తాం కదా.

క, ఖ, గ, ఘ, ఙ: ఇవి క-వర్గు.
చ, ఛ, జ, ఝ, ఞ: ఇవి చ-వర్గు.
ట, ఠ, డ, ఢ, ణ: ఇవి ట-వర్గు.
త, థ, ద, ధ, న: ఇవి త-వర్గు.
ప, ఫ, బ, భ, మ: ఇవి ప-వర్గు.