పుట:Ramanujan Nundi Etu Atu by Vemuri Venkateswararao.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విషయం శిష్యులకో, కొడుకులకో నేర్పటం. వీళ్లు శ్లోకాలు ఇలా వల్లె వేస్తూ కూర్చుంటే కడుపు నిండేదెలా? అందుకని ఈ కంఠోపాఠం చేసే సంప్రదాయాన్ని (‘ఓరల్ ట్రేడిషన్’) ని రక్షించటానికి రాజులు బ్రాహ్మణులని పోషించటం మొదలు పెట్టేరు. ఇలా కొన్ని శతాబ్దాలపాటు ఆక్షేపణ లేకుండా జరిగింది.

తర్వాత తాళపత్రాల మీద ఘంటంతో రాయటం నేర్చుకున్నారు. తాళపత్ర గ్రంథాలతో ‘ఇంటింటా సొంత గ్రంథాలయం’ నిర్మించటానికి అవకాశాలు తక్కువ. కనుక రాత వాడుకలోకి వచ్చిన తర్వాత కూడ కంఠస్థం చెయ్యటం అనే ప్రక్రియ మన విద్యా విధానంలో ఒక ముఖ్యాంశం అయిపోయింది.

వచనాన్ని కంఠస్థం చెయ్యటం కన్న పద్యాన్ని కంఠస్థం చెయ్యటం తేలిక. అందుకనే ఆర్యభట్టు, భాస్కరాచార్యులు మొదలైనవారంతా గణితాన్ని కూడ శ్లోకాలలోనే రాసేరు. జ్ఞాపకం పెట్టుకోడానికి పద్యంలో బిగుతు ఉండాలి. విశాలమైన భావాన్ని క్లుప్తంగా పద్య పాదాలలో ఇరికించగలిగే స్థోమత ఉండాలి. అందుకని మన వాళ్లు ఒక సంక్షిప్త లిపి (code) ని తయారు చేసుకున్నారు. గణితశాస్త్రం లోని సునిశితమైన విషయాలని ముందు సంక్షిప్త లిపి లోనికి మార్చి, దానిని చందస్సుకు సరిపడా పద్య పాదం లోనికి ఇరికించేసరికి దాని లోని గూఢార్ధం మనబోటి అర్భకులకి అందుబాటులో లేకుండా పోయింది. అంతే కాని, విద్యని, విజ్ఞానాన్ని రహస్యంగా దాచాలనే దుర్బుద్ధి మన సంస్కృతిలో ఎప్పుడూ, ఎక్కడా లేదు.

మన పురాతన గ్రంథాలలోని మూల భావం కూలంకషంగా అర్థం చేసుకోవాలంటే వ్యాకరణ సూత్రాలు అర్ధమైనంత మాత్రాన సరిపోదు. వారు కాచి వడపోసిన సూత్రాలలోని అంతరార్ధం కూడ అర్ధం కావాలి. ఇలా గూఢ భాషలో, సంక్షిప్త లిపిలో రాయటం కంఠోపాఠానికి అనుకూలిస్తుందనే చేసేరు తప్ప విద్యని నలుగురికి పంచిపెడితే శేముష్య సంపద (intellectual property) కి నష్టం వస్తుందని కాదు. ఇలా శేముష్య సంపద వంటి ఊహలు ఎవరి పుర్రెలోనైనా పుడితే వారిని నిరుత్సాహ పరచటానికా అన్నట్లు, ‘తనకి వచ్చిన విద్యని శిష్యులకి బోధించని గురువు మరుసటి జన్మలో బ్రహ్మ రాక్షసుడు అవుతాడు’ అనే లోక ప్రవాదం లేవదీసేరు.