పుట:Ramanujan Nundi Etu Atu by Vemuri Venkateswararao.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చోట స్థావరం దొరుకుతుంది. మనకి ఎదురయ్యే “జంట సంఖ్య” (complex number) z అయితే దాని స్థావరం “జంట తలం” లో ఎక్కడో ఒక చోట ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? జంట సంఖ్య z లో సత్యం పాలు x, కల్పన పాలు y అయినప్పుడు z = (x , i y ) లేదా z = x + i y రాస్తారు.

బొమ్మ 5.2 జంట తలంలో ఒక జంట సంఖ్య z ని సూచించడం

5.3 రామానుజన్, జంట సంఖ్యలు

రామానుజన్ ఇంగ్లండు వెళ్లక పూర్వం ఆయనకి ఈ జంట సంఖ్యల ఉనికి తెలిసి ఉన్నట్లు దాఖలాలు లేవు; ఋష్యశృంగుడు లా అయన నిజ రేఖ మీద కనబడే నిజ సంఖ్యల మధ్యనే బతికేడు. జీటా ప్రమేయం విలువ కట్టినప్పుడు కూడ ఆయన ఋణ నిజ రేఖ మీద విలువలనే లెక్కలోకి తీసుకున్నట్లు కనిపిస్తుంది. అంటే రామానుజన్ “ఆయిలర్ జీటా ప్రమేయాన్ని” మళ్లా సొంతంగా కనిపెట్టి నిజ రేఖ మీద దాని లక్షణాలని గుర్తించేరు. కాని ఇదే ప్రమేయాన్ని రీమాన్ జంట తలానికి అనువర్తింపచేసేరన్న విషయం రామానుజన్ కి తెలియక పోవడం మన దురదృష్టం. ఈ కారణం వల్ల రామానుజన్ ఇండియాలో ఉండగా ప్రధాన సంఖ్యల మీద చేసిన పరిశోధన అంతా ఒక విధంగా “కంచి గరుడ సేవే” అయిపోయింది.