మరల తమ యథాస్థానమునకు వచ్చిచేరెను. ఎల్లరకు మిక్కిలి సంతోషమాయెను.
తానీషా దర్బారున సంగీతము, నాట్యము మొదలగు వినోద కార్యములతో ఆనందించుచుండగా భద్రాద్రిపౌరులు కొంద రేతెంచి తమ తాలూకాకు హిందూ తహశీల్దారు నొకని బ్రసాదింపవలయునని కోరగా వెంటనే నబాబు తానీషా అక్కన్న మంత్రితో నాలోచించి గోపన్నను భద్రాద్రితాలూకా తహశీలుదారుగా నియమించునట్లు తీర్మానించి తక్షణమే గోపన్నకు ఫర్మానా పంపిరి. ఫర్మానా అందిన వెంటనే గోపన్న భద్రాద్రితాలూకా తహసీల్ దారు ఉద్యోగమున ప్రవేశించెను.
నేలకొండపల్లె, గోపన్న గృహము, కబీరు అప్పుడప్పుడు గోపన్న గృహమునకు వచ్చుట ! వారు, హిందూమత సంప్రదాయానుసారముగా గురుపూజ నొనర్చుట! కబీరు గోపన్నకు "రామదాసు " నుండు మని నూతన నామకరణ మొనర్చుట !
కబీరు రామదాసు గృహమునుండి వెలువడిన వెంటనే రాజ సేవకు డొకడు ఫర్మానాతో రామదాసు వద్దకు వచ్చి భద్రాద్రి తహశీలుదారు పనియందు నియమించినట్లు తెల్పుట !
రామదాసు భద్రాద్రికి ప్రయాణమగుట ! భద్రాద్రి పరిసర ప్రాంతమున పౌరులు కొందఱు తప్పతాగి వినోదముగా కాలక్షేప మొనర్చు సందర్భమున రామదాసు వారిని చూచుట తటస్థించెను. సుర త్రాగుట మంచిమార్గము కాదని వారికి హిత మొసంగి, భద్రగిరిపైనున్న శ్రీరాముల వారి యాలయ నిర్మాణ కార్యక్రమమునకై తనకు చేయూత నొసంగి ద్రవ్యము చందాలమూలమున వసూ లొనర్ప బోధించును.
రామదాసు పౌరుల చందాలవల్లను, సర్కారు ఖజానా నుండి కొంత ద్రవ్యమును వెచ్చించి శ్రీరాములవారికి దేవాలయము నిర్మించి నానావిధ కైంకర్యాదుల కొఱకును, బ్రాహ్మణ సంతర్పణముల కొఱకును ఆరులక్షలరూప్యముల వరకు వ్యయమొనర్చెను.
గోలకొండ తానీసా గారికి, సర్కారుద్రవ్యము వ్యయ మొనర్చి దేవాలయ నిర్మాణాను లొనర్చెనని తెలియవచ్చెను.వెంటనే తానీషా భటులను పంపి, తక్షణము పైకము నివ్వమని కోరుడనియు, లేకున్న చెరబట్టి తన యాస్థానమునకు గొని రండనియు ఆజ్ఞ నొసంగెను. రామదాసు దర్బారునకు గొనిరాబడిన పిమ్మట ' ఏడుదినములు గడు నొసంగెదను; ఇంతలో నీ ద్రవ్యము నాకోసంగిన సరి ! లేకున్న మరణదండన విధింతు ' మని తెల్పెను. ఏడుదినములు రాత్రిం బవళ్లు చెప్పరాని కఠిన దండనలకు రామదాసు లోనయ్యేను. రామదాసు శ్రీరాముని అనేక విధముల కష్టముల నివారణ మొనర్ప బ్రార్థించెను. శ్రీరాములకు కరుణ గలిగి తానీషా శయనాగారమున కేతెంచి ఆరులక్షలధన మొసంగి తన భక్తుని గాపాడును, అప్పుడు తానీషా రామదాసుయొక్క దైవభక్తికి మెచ్చి వెంటనే చెఱవిముక్తి చేయును.తానిషా రామదాసు ను అనేక విధములుగ క్షమాపణకోరును. గొప్ప పదవుల నొసంగెద ననును. కాని రామదాసు వానిని సరకుగొనక మరల భద్రాద్రికి వెళ్ళి పూర్వమువలెనే శ్రీరామపాద సేవయందుండ సంకల్పించుకొని భార్యాపుత్రాదులతో వెడలిపోవును. దైవభక్తిగల నిజభక్తులకు శ్రీమన్నారాయణుడే దిక్కగును,