పుట:Rajayogasaramu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

రా జ యో గ సా ర ము

నది బీజమై యుండు నఖిలంబులకును
అచటఁ బ్రవర్తించు నఖిలదృశ్యములు
ప్రచురంబుగాఁ బరాత్పరవస్తు వరయు
ఘనతరాపోజ్యోతిగతిని రేపవలు
మొనసి యంతర్బాహ్యముల వెల్గుచుండు
నారయ నుపనిషదర్థసూచకము
వేఱు చిత్తములేక విన దృఢంబుగను
అలరార నీలతోయదమధ్యమందు
వెలుఁగు విద్యుల్లేఖవిధమున మఱియు
సురుచిరనీవారశూకంబు పగిది
నరయ నీలచ్ఛాయ నలరుచు మఱియుఁ
జెలువంద పావకశిఖ దానినడుమ
బలముగ వ్యాపించి పరమాత్మయుండు
నిది బ్రహ్మ మిదె శివుం డిదియ విష్ణుండు
నదియ దేవేంద్రుండు నదియ యక్షరము
అదియుపో పరమంబు నదియే స్వరాట్టు
నదియ సత్తామాత్ర మని యార్యజనులు
తఱచుగ దైవభేదంబు లెన్నుదురు
పరతత్వమున భేదభావంబు లేదు
నామరూపంబు లెన్నఁగ వేఱులైన
హేమంబునకు భేద మెందైనఁ గలదె?
ఆరీతి వెల్గు నాయాత్మఁ జూచుటకు