పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మెల్లగా ప్రాకుచున్నట్టే కనఁబడుచుండెను: ఇంతలో జీఁకటియుఁ బడెను. కొంతసేపటికి రాజశేఖరుఁడుగారు క్రిందఁ జూచునప్పటికి బండి కదలుచున్నజాడ కనఁబడలేదు. అప్పడు కుంభకర్ణునివలె నిద్రపోవుచున్న యా బండివానిని లేపఁబూనుకోగా, కేకలేమియు బనిచేసినవికావు కాని వాని కాలిమీఁద కొట్టినదెబ్బలు మాత్రము వానిని, కదలి యొక్క మూలుగు మూలిగి మఱి యొక్క ప్రక్క పరుండు నట్లు చేసినవి, మహాప్రయత్నముమీఁద వానిని లేపి క్రిందదిగి చూచువఱకు బండి త్రోవతప్పి వచ్చి యొకపొలములో మోఁకాలిలోతు బురదలో దిగఁబడియుండెను. అప్పుడందఱును దిగి యావచ్ఛక్తి నుపయోగించి రెండు గడియలకు బండిని రొంపిలోనుండి లేవనెత్తి మార్గమునకు లాగుకొని వచ్చిరి, కాని యెడ్లు మాత్రము తాము బండిని గొనిపోవు స్థితిలో లేక తమ్మే మఱియొకరు గొనిపోవలసిన యవస్థయం దుండెను. కాబట్టి చీకటిపడువఱకును బండి శ్రమచేసి వారిని లాగుకొని వచ్చినందునకుఁ బ్రత్యుపకారముగా నిప్పుడు చీకటిపడ్డందున వారే బండి నీడ్చుకొనిపోవలసిన వంతు వచ్చెను. ఇట్టియవస్థ పగలు సంభవింపక రాత్రి సంభవించినందున కెల్లవారును మిక్కిలి సంతోషించిరి, అందఱి బట్టలకును బురదచేత జిన్నవియుఁ బెద్దవియునైన పలువిధములైన పుష్పము లద్దబడినవి; బండిలో నెక్కివచ్చినవారి కెట్లున్నను చూచువారు లేకపోయిరి కాని, యున్న యెడల వారికెంతయైన వినోదము కలిగి యుండును. బండివాఁడు భీమునివంటివాఁడు గనుక రాజశేఖరుడుగారి సహాయ్యముచేత బండిని సులభముగా నీడ్చుచుండగా, సుబ్రహ్మణ్యము వెనుక జేరి యెడ్లను స్త్రీలను నడిపించుకొని వచ్చెను. వారు నడిచియే వెళ్ళినయెడల జాములో పలనె రాజమహేంద్రవరము వెళ్ళి చేరియుందురు గాని బండినికూడ నీడ్చుకొని పోవలసివచ్చినందున రాత్రి రెండు యామములకు రాజశేఖరుఁడుగారి పినతండ్రికుమారుఁడగు రామమూర్తిగారి యిల్లు చేరిరి. అప్పుడందఱును మంచినిద్రలో నుండిరి; కాఁబట్టి బండిచప్పుడు కాఁగానే తలుపు తీయఁగలిగినవారు కారు. కొంత సేపు