పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొని రోగపడి యొక్కువ కర్చును దెచ్చిపెట్టినందున కామెమీఁద నెంతో కోపము వచ్చి రాజశేఖరుఁడుగారు విసుగుకొనుచుండఁగా పని నిమిత్తమయి వచ్చి తిరిగిపోవుచున్న యొక బ్రాహ్మణుఁడు దగ్గఱ నుండి విని యామెను దూషించిన లాభములేదని చెప్పి తాను వంట బ్రాహ్మణుఁడనుగా గుదిరెదననియు, ఆమెను మనసు వచ్చినన్నాళ్ళు రోగపడనిండనియుఁ జెప్పుటయేకాక వంటకు నలభీమ పాకములను మించునట్లు చేయ తానున్నందున నిష్టమున్నచో నామె మృతినొంది నను బొందవచ్చునన్న యభిప్రాయమును సహితము సూచనగాఁ గనఁ బఱిచెను అతని దెట్టిసత్యవాక్కో కాని యాదినము మొదలుకొని తగు వైద్యుఁడు లేనందుననో, ఆ బ్రాహ్మణుఁడే పథ్యపానములు జరుపుచు వచ్చినందుననో ప్రబల యొకనాఁ డామెకుఁ బ్రాణము మీఁదికి వచ్చెను. ఆ దినము నక్షత్రము మంచిది కాదని పురోహితుఁడు చెప్పినందున, ఆమెను వీధిలోనికిఁ గొనిపోయి గోడప్రక్కను భూశయనముచేసి యొకచాప యడ్డము పెట్టిరి, ఆమెయు రాత్రి జాము ప్రొద్దు పోయిన తరువాత లోకాంతరగతురా లయ్యెను. ఆ దినము తెల్లవాఱిన దనుక వింటనున్న వా రందఱును పీనుఁగుతో జాగరము చేసిరి. మఱునాఁడు ప్రాతఃకాలమునుండియు సమస్తప్రయత్నములు చేసినను, ఊరనున్న బ్రాహ్మణులలో నెవ్వరును సాహాయ్యమునకు వచ్చిన వారు కారు. రాజశేఖరుఁడుగారు తామే వెళ్ళి యొకచోట బోగముదాని యింట పీనుఁగుల విస్సన్నను పట్టుకొని సంగతిని దెలుపఁగాఁ ఆతఁడు బేరముల కారంభించి పదియాఱు రూపాయిలకు శవమును మోచుట కొప్పుకొని లేచివచ్చెను. ఇప్పుడు సహిత మాంధ్రదేశపు బ్రాహ్మణులలో ముఖ్యముగా స్మార్తులలో నెవరియింటనైన ఎవ్వరైనను మృతినొందినప్పుడు బంధువులును కులమువారును తక్కిన మతముల యందువలె దమంతట వచ్చి సాయము చేయుట లేకపోఁగా వచ్చి ప్రార్థించినను రాక సాకులు చెప్పుటయు మొగము చాటువేయుటయు బ్రాహ్మణజాతి కంతకు నవమానకరముగా నున్నది. సమస్తాపదలలోను ఘోరతరమయిన యీ యాపదకే యెవ్వరును తోడుపడనపు డొక