పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చి వీధిలో నొక యరుగుచెంత నిలుచుండి రథము వంక జూచుచుండెను. ఈ దేశములో సాధారణముగా స్త్రీలు తమ భర్తలు గ్రామమున లేనప్పడు విలువచీరలు కట్టుకొని యలంకరించు కొనుట దూష్యముగా నెంచువా రయినను, ఇతరులయింట జరుగు శుభకార్యములయందు పేరంటమునకు వెళ్ళునప్పుడు గాని గ్రామములో జరిగెడి స్వామి కళ్యాణ మహోత్సవమును గ్రామదేవతల తీర్ధములను జూడఁబోవునప్పుడు గాని యెరువుతెచ్చుకొనియైన మంచిబట్టలను మంచి నగలను ధరించుకొనక మానరు. అప్పటి యామె సౌందర్యము నేమని చెప్పుదును! నిడుదలై సోగలైన కన్నులకుఁ గాటుక రేఖ లొకసొగసు నింప, లేనవ్వు మిషమున నర్థచంద్రునిఁ బరిహసించు నెన్నుదురున బాలచంద్రుని యాకృతినున్న కుంకుమబొట్టు రంగులీన, శృంగార రస మొలికెడి యా ముద్దు మొగముయొక్క- యప్పటి యొప్పిదము కన్నులకఱవు తీఱ జూచి తీఱవలసినదే కాని చెప్పిన తీఱదు. రథ మామె దృష్టిపథమును దాఁటిపోయినతోడనే ద్వాదశోర్ధ్వపుండ్రములను దిట్టముగా ధరి యించి దాసరులు ఇనుప దీప స్తంభములలో దీపములు వెలిగించు కొని నడుమునకుఁ బట్టు వస్త్రములను బిగించుకొని యొకచేతిలో నెమలికుంచె యాడించుచు రెండవ చేతిలోని గుడ్డచుట్టలు చమురులో ముంచి వెలిగించి సెగ సోకకుండ నేర్పుతో దేహము నిండ నంటించు కొనుచు ప్రజలిచ్చు డబ్బులను దీప స్తంభముల మట్లలో వేయుచు నడిచిరి. ఆ సందడి యడఁగినతోడనే రుక్మిణి తల్లియు మఱికొందరును తోడనడువ బయలుదేఱి, ఉత్సవమునిమిత్తమయి పొరు గూళ్ళనుండి వచ్చి గుడారములలో బెట్టిన కంచరీదుకాణములను పండ్ల యంగళ్ళను దాఁటి, మెట్ల పొడుగునను ప్రక్కలయందు బట్టలు పఱచుకొని యఱచుచు కూరుచున్న వికలాంగులకు సెనగపప్పును గవ్వలును విసరివైచుచు, కాశికావళ్ళు ముందుబెట్టుకొని పుణ్యాత్ములను పాపాత్ములను స్వర్గమును నరకమును జూపెదమని పటములు చేతఁబెట్టుకొని వచ్చెడివారిని పోయెడివారిని నడ్డగించెడు కపట యాత్రికులకు తొలఁగుచు, కొండయెక్కి దేవతాసందర్శ