పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీధి వంకఁ జూచుచుండెను. ఆ రథమునకుఁ బదియడుగుల దూరమున వెదురు పేళ్ళతో నల్లబడి పయిని గుడ్డ మూయబడి వికృతాకారముతో నున్న యాంజనేయవిగ్రహములోను గరుడవిగ్రహములోను మనుష్యులు దూరి, చూడవచ్చిన పల్లె వాండ్రును పిల్లలను జడిసికొన లాగున నెగిరెగిరిపడుచు లక్కతలకాయలఁ ద్రిప్పుచుండిరి. అప్పడు పూజారులు పల్లకిలో నుత్సవవిగ్రహముల నెక్కించుకొని వాద్యము లతోఁ గొండదిగివచ్చి రథమునకు మూఁడు ప్రదక్షిణములను జేయించి స్వామి నందు వేంచేయింపఁజేసిరి; చెంతలనున్నవా రందఱును క్రిందనుండి యరఁటిపండ్లతో స్వామిని గొట్టుచుండగా రథము మీఁద గూర్చున్న యర్చకులును తదితరులును చేతులతో దెబ్బలు తగులకుండఁ గాచుకొనుచు నడుమ నడుమ జేగంటలు వాయించుచు గోవిందా యని కేకలు వేయుచుండిరి. ఆ కేకలతో రథములకుఁ గట్టి యున్న మోకులను వందలకొలఁది మనుష్యులు పట్టుకొని యిండ్ల కప్పులను వీధి యరుగులును కూలునట్లుగా రథము నీడ్చుచుండిరి. అంతట భోగముమేళ మొకటి రధమునకుముందు దూరముగా నిలువఁ బడ, మద్దెలమీఁద దెబ్బ వినఁబడినతోడనే దేవునితో నున్న పెద్ద మనుష్యు లందఱును మూకలను త్రోచుకొనుచు వెళ్ళి యాటకత్తియలముందు మున్నున్నవారిని వెనుకకుఁ బంపి తాము పెద్దలయి యుత్సవము నందు గాన వినోదమునకు కొఱత రాకుండ సమర్ధించుచుండిరి.

అప్పడు రుక్మిణి సమస్తాభరణ భూషితురాలయి, ఉమ్మెత్త పువ్వువలె నందమై బెడబెడలాడుచున్న కుచ్చిళ్ళు మీఁగాళ్లపై నొఱయ, ఎడమభుజము మీఁదినుండి వచ్చి జరీ చెట్లుగల సరిగంచు పయ్యెద కొంగు వీపున జీరాడ కట్టుకొన్న గువ్వకన్నద్దిన నల్లచీర యామె యందమున కొకవింత యందమును గలిగింప, కాళ్ల యందియ లును, పాంజేబులును. గళ్ళగళ్ళున శ్రావ్యనాదము చేయ, కుడి చేయి తప్పఁ గడమభాగమంతయుఁ బయిటలోఁ డాఁగి కనబడక యున్న వంగపండుచాయగల గుత్తపుపట్టరైక నీరెండలో ద్విగుణ ముగాఁ బ్రకాశింప, కొప్పులోని కమ్మపూవులతావి కడలకుఁ బరిమళము లెసంగుచు గంధవహువి సార్ధకనామునిఁ జేయ, నడచి