"భాగ్యముకల చెయ్యి, ప్రతిష్టగల చెయ్యి" యని పలికి, “నీ వొక్కతలఁపు తలఁచినావు: ఒక్క కోరిక కోరినావు; ఒక్క మేలడిగినావు: అది కాయో పండో, కల్లో నిజమో, చేకూఱునో, చేకూఱదో యని త్రొక్కటపడుచున్నావు; అది కాయకాదు పండు: కల్ల కాదు నిజము. శీఘ్రముగానే చేకూఱనున్నది. ఆఁడువారివంక తలఁపా మగవారివంక తలఁపా యందు వేమో__మగవారంటే గడ్డము, ఆడవా రంటే లక్కాకు" అని రుక్మిణి ముఖలక్షణములను చక్కగా కనిపెట్టి "మగ వారివంక తలం'పన్నప్పుడామె మొగ మొకవిదముగా నుండుట చూచి సంగతి నూహించి “నీది మగవారివంక తలంపు శీఘ్రముగానే కార్యము గట్టెక్కనున్నది; నీ రొట్టె నేతఁ బడనున్న" దని చెప్పి తక్కిన ప్రసంగమువలన రుక్మిణి మనసులోని సంగతి నంతనుఁ దెలిసికొని రుక్మిణిఁమగడు దేశాంతరగతుఁ డయినవార్త నా వఱకే వినియున్నదికాన "నీ మగఁడు చెడుసావాసము చేత దేశాలపాలయి తిరుగుచున్నాఁడు; నీ మీది మోహముచేత నెల దినములలో నిన్ను వెదుకుకొనుచు రాగలడు" అని చెప్పి సంచిలోని పేరు నొకదానిని తీసి పసుపుదారముతో జేతికి కట్టి ప్రాఁతబట్టయు రవికయు బుచ్చు కొని, మగనితోఁ గలిసి కాపురము చేయుచున్న తరువాత క్రొత్తచీర పెట్టుమని చెప్పి తనదారిని బోయెను. రుక్మిణియు బరమానంద భరితురాలయి అంత సూటిగాఁ దన మనోగతమును దెలిపినందుకై యెఱుకత యొక్క మహత్త్వమును మెచ్చుకొని యబ్బురపడుచు లోపలికిఁ బోయెను.