పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/63

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

దేశాంతరమునకు లేచిపోయి, యాఱునెలలకు గడ్డమును తలయును బెంచుకొని మరల వచ్చి, భూతవైద్యుఁడ నని వేషము వేసికొని నుదుట పెద్దకుంకుమబొట్టు పెట్టుకొని వీధులవెంబడి తిరుగుచుండెను. ఆవఱకే దామోదరయ్య తానార్జించుకొన్న ధనమును వేఱు జాగ్రత్త చేసికొన్నందున అప్పడాధనముతో నొక యిల్లుగట్టి ఆ గ్రామములోనే ప్రత్యేకముగా నొకచోటఁ గాపురముండెను. ఆతని భూతవైద్యము నానాఁటికి బలపడినందున ఊర నెవ్వరికైన కాలిలో ముల్లుగ్రుచ్చు కొన్న నాతనిచేత విభూతి పెట్టించుచుందురు. ఈ విధముగా దామో దరయ్య భాగ్యవంతుడగుటయేకాక, జనులచేత మిక్కిలి గౌరవ మును సహితము పొందుచుండెను.

రెండవయాతఁడైన నారాయణమూర్తి మొదట సద్వంశ మునఁ బుట్టినవాడేకాని దుర్మార్గులతో సాహసము చేసి తనకుఁగల కాసువీసములను వ్యయముజేసికొని బీదవాఁ డయ్యును పయికి ధని కునివలె నటించుచుండెను, అతనికి భాగ్యము పోయినను దాని ననుసరించియుండిన చిహ్నములు మాత్రము పోనందున, నారాయణమూర్తి తఱుచుగా రాజశేఖరుఁడుగారి యింటికి వచ్చుచు రహస్యమని చెప్పి రాజశేఖరుఁడుగారిని లోపలికిఁ బిలుచుకొనిపోయి తన యక్కరను దెలిపి సొమ్ము బదులడుగుచుండును. ఆ ఋణము మరల తీయినది గాదని దృఢముగా నెఱిగియు, రాజశేఖరుడుగారు మానవంతుల గౌరవమును కాపాడుచుండుటయందు మిక్కిలి యభిలాష కలవారు గనుకను, ఆతఁడు చిన్నతనములో తన సహపాఠిగనుకను, ఆడిగిన మొత్తమును రెండవవా రెఱుఁగకుండ చేతిలోబెట్టి పంపుచుందురు. ఆతఁడా ధనముతో సరిగ వస్త్రములు సుగంధ ద్రవ్యములు మొదలగు వానిని గొనుచు మిత్రులకు షడ్రసోపేతముగా విందులు చేయు చుండును. ఇదిగాక యాత డితరస్థలములలో జేసిన ఋణముల కయి ఋణప్రదాతలు తొందరపెట్టినందున, రాజశేఖరుడు గారు తన సొంత సొమ్ములోనుండి యప్పుడప్పుడు మూడువేల రూపాయలవఱకు నిచ్చి యాతనిని ఋణబాధనుండి విముక్తునిజేసిరి. రెండు సంవత్సరముల