పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదియేను వత్సరము లున్నవి; ఆతనిపేరు శంకరయ్య. అతని కెని మిది సంవత్సరములు దాటకముందే తల్లి పోయినందున, అతఁడు చిన్నప్పటినుండియు మేనమామగారి యింటనే పెరిగినాఁడు. అతనికే సీతనిచ్చి వివాహము చేయవలయునని తల్లిదండ్రుల కిద్దఱికిని నుండెను. భార్యపోయినతరువాత దామోదరయ్య రాజశేఖరుఁడు గారి సాయముచేతనే రెండవ వివాహము చేసికొనెనుగాని యాచిన్నది పెండ్లినాటికి తొమ్మిది సంవత్సరములలోపు వయస్సు గలది గనుక, ఈడేరి కాపురమునకువచ్చి రెండుసంవత్సరములు మాత్రమే యయి నది. ఆతనికి ద్వితీయ కళత్రమువలన సంతాన మింకను కలుగ లేదు. దామోదరయ్య మొదటినుండియు మిక్కిలి బీదవాఁడు; ఆతనికి రాజశేఖరుఁడుగారి చెల్లెలి నిచ్చునప్పటికి రాజశేఖరుఁడుగారి తండ్రియు ధనవంతుఁడు కాఁడు. వారిది పూర్వము వసంతవాడ నివాస స్థలము. రాజశేఖరుడుగారి తండ్రి తన యింటికి గోడలు పెట్టించుటకయి పుట్టలు త్రవ్వించుచుండగా నొకచోట నిత్తడిబిందెతో ధనము దొరికినది. ధనము దొరికినతరువాత స్వస్థలములో నున్న విశేష గౌరవముండదని యెంచియో, లోకుల యోర్వలేనితనము నకు జడిసియో రాజశేఖరుఁడుగారి తండ్రి దారపుత్రాదులతో నల్లని గూడ వెంటఁ బెట్టుకొని వచ్చియప్పటినుండియు ఈ ధవళగిరియందే నివాసముగా నుండి యాచుట్టుపట్టులనే మాన్యములుగొని కొంతకాలమునకు మరణము నొందెను. భార్య పోవువఱకును దామోదరయ్య రాజశేఖరుఁడుగారి యింటనే యుండి, ఆయనపేరు చెప్పి ధనము యితరులవద్ద తెచ్చి తానపహరించుచుఁ బయికిఁ దెలియనియ్యక దాచుకొనుచుండెను. తరువాత అప్పులవారు వచ్చి తొందరపెట్టినపుడు రాజశేఖరుఁడుగారే సొమ్మిచ్చుకొనుచుండిరి. తోడఁబుట్టినపడుచు పోయిన తరువాత దామోదరయ్య చేయు నక్రమములకు సహింపలేక యొకనాడు రాజశేఖరుడుగా రాతనిని కఠినముగా మందలించిరి. ఆందుమీఁదఁ గోపము వచ్చి దామోదరయ్య తన్ను బావమఱఁది కట్టు బట్టలతో నిల్లు వెడలగొట్టినాఁడని యూరివారందరిముందఱఁ జాటుచు