పీఠిక
మొుదటి కూర్పు
ఈవఱకు మనయాంధ్రభాషలో జనుల యాచార వ్యవహారములను దెలుపుచు నీతిబోధకములుగానుండు వచన ప్రబంధము లేవియు లేకపోవుట యెల్ల వారికిని విశద మయియే యున్నదిగదా! అయినను దేశభాషలలో నెల్లను మధురమైనదని పేర్కొనఁబడిన మన తెనుఁగుభాష కటువంటి లోపమును తొలగింపవలయునని కొంత కాలము క్రిందట నే నీ గ్రంథమును వ్రాసి శ్రీవివేకవర్ధనీ పత్రికా ముఖమునఁ బ్రకటించితిని, ఇట్టు గ్రంథములను వ్రాయుట కిదియే ప్రథమ ప్రయత్నమగుటచేత దీనియందుఁ బెక్కులోపము లుండి యుండవచ్చును. ఆయినను దీనిం జదివినవా రందఱును నైక కంఠ్యముగా మంచియభిప్రాయమునే యిచ్చుచు వచ్చినందునను పలువురు పుస్తకముల నిమిత్తమయి వ్రాయుచు వచ్చుచున్నందునను నేను పడిన ప్రయాసము నిష్ఫలము కాలేదుగదాయని సంతోషించు చున్నాను.
***
ఈ గ్రంథముయొక్క కథను గల్పించుటలో గోల్డుస్మిత్తను నింగ్లీషు కవీశ్వరుని గ్రంథ సాహాయ్యమును గొంత బొందినను దాని కిని దీనికిని విశేష సంబంధమేమియు నుండదనియు దీనియందు వ్రాయబడిన విషయములన్నియు నూతనములే యనియుఁ గూడ విన్నవించుచున్నాడను. గుణగ్రహణ పారీణులగు పెద్దలు దీనియందు దోషముల నుపేక్షచేసి గుణముల నే గ్రహింతురనియు ఆంధ్రదేశీయులును విద్యాశాఖవారును దీని నాదరించి మఱియు నిట్టి గ్రంథములను చేయుటకయి నాకుఁ దగినంత ప్రోత్సాహమును గలిగింతురనియుఁ గోరుచున్నాఁడను.
రాజమహేంద్రవరము | ![]() |
కందుకూరి వీరేశలింగము |
ది 20 వ జూలై 1880 సం॥రం | ![]() |