నాల్గవ ప్రకరణము
పురాణ కాలక్షేపము__రాజశేఖరుఁడు గారి స్థితి__ఆయన బావమఱఁది దామోదరయ్య చరిత్రము__మిత్రుఁడు నారాయణమూర్తి కథ_ఎలుక యడుగుట.
రాజశేఖరుఁడుగారు భోజనము చేసినతరువాత ఒక్క నిద్ర పోయి లేచి, తాంబూలము వేసికొని కచేరిచావిడిలోనికివచ్చి కూర్చుండిరి. అంతకుమునుపే గ్రామమునఁ గల పెద్ద మనుష్యులు పలువురు వచ్చి తగిన స్థలములలో గూర్చుండి యుండిరి. అప్పుడు రాజశేఖరుడు గారు 'సుబ్రహ్మణ్యా" అని పిలిచినతోడనే 'అయ్య' అని పలికి లోపలినుండి పదియాఱు సంవత్సరముల వయసుగల యెఱ్ఱని చిన్నవాఁ డొకఁడు వచ్చి యెదుర నిలువఁబడెను. ఆతఁడు రాజశేఖరుఁడుగారి జ్యేష్టపుత్రుఁడు; సీత పుట్టిన తరువాత రెండు సంవత్సరములకు మఱి యొక పిల్లవాఁడు కలిగెనుగాని యాచిన్నవాఁడు పురుటిలోనే సంధి గొట్టిపోయెను. ఆ వెనుక మాణిక్యాంబకు కానుపులేదు.సుబ్రహ్మణ్యము యొక్క మొగ మందమైనదేకాని మూడేండ్లప్రాయమున బాలరోగము వచ్చినప్పడు పసుపుకొమ్ముతోఁ గాల్చిన మచ్చమాత్రము నొసటను గొంచెము వికారముగా నుండెను; కన్నులు పెద్దవి; నుదురు మిట్టగా నుండెను; తల వెండ్రుకలు నిడుపుగాను నల్లగాను ఉండెను. చేతుల బంగారు మురుగులను చెవులను రవలయంటుజోడును అనామికను పచ్చదాపిన కుందనంపుపని యుంగరమును ఉండెను.
రాజ__సుబ్రహ్మణ్యా! అందటితోఁగూడ నీవు మధ్యాహ్నము భోజనమునకు వచ్చినావుకావేమి?
సుబ్ర__కార్తిక సోమవారము గనుక, ఈ దినము రాత్రిదాక నుండి మఱి భోజనము చేయవలెననుకున్నాను.