పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 సోమ__అయ్యో ! స్త్రీ పాకమే కాకుండ నియోగిపాకము కూడ నేనెట్లు పుచ్చుకొందును? కొంచె మత్తెసరు పెట్టించిన నేను వచ్చి దింపుకొనెదను.

రాజ__నేఁడు సందర్భపడదు. ఈ పూఁట మీరు వేరే యొక్కడకయిన విజయం చేయవలెను.

సోమి__(కొంచెము సేవనుమానించి)నే నెఱుఁగుదును. మీది మొదటినుండియు శిష్ట సంప్రప్రదాయము__మీ తాతగారెంతో కర్మిష్టులు; మీతండ్రిగారు కేవలము బ్రహ్మవేత్త, మీయింట నాకభ్యంతరము లేదు గాని యొకచోట భోజనముచేసినానన్న మఱియొకచోటనుగూడ నాలాగుననే చేయుమందురు. నేనిక్కడ భోజనము చేసినమాటను మీరు రహస్యముగా నుంచవలెను. కార్తిక సోమవారము గనుక గోదావరికిఁ బోయి నిమిషములో స్నానముచేసి వచ్చెదను.ఇంతలో వడ్డనకానిండు"

అని పేరయ్యసోమయాజులు కృష్ణాజినమును నారసంచియు నట్టింటఁబెట్టి గోదావరికిఁ బోయి స్నానముచేసివచ్చి, కృష్ణాజినమును చావడిలో క్రిందఁబఱచి దానిమీఁద దర్భాసనము వేసికొని కూర్చుండి. గోముఖములోఁ జేయిదూర్చి లోపల రుద్రాక్షమాలను ద్రిప్పుచు కన్నులుమూసికొని జపముచేయ నారంభించెను. ప్రసాదరావు నల్ల మందువాఁడనని తొందరపడుటను వడ్డించియున్న యన్నమును కూర లను చల్లారిపోవుటను జూచి లోపల విస్తళ్ళముందఱఁ గనిపెట్టు కొని యున్నవారు లేచివచ్చి పలుమాఱు పిలువఁగాబిలువఁగా సోమ యాజులు రెండుగడియలకు మౌనముచాలించి లేచివచ్చి విస్తరి ముందఱఁ గూరుచుండెను. అప్పుడందఱును పరిషేచనములుచేసి భోజనముచేయ మొదలుపెట్టిరి.

రాజ__రాజమహేంద్రవరమునుండి శుభలేఖ తీసికొనివచ్చిన నీళ్ళకావడి వెంకయ్యజాడ లేదు. ఎక్కడఁ గూర్చున్నాఁడు?

వెంక__అయ్య! అయ్య ! ఇదిగో సోమయాజులుగారి వెనుక మూల విస్తరివద్దఁ గూరుచున్నాను.