పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చిరి. వెళ్ళునప్పడు మీరు పెట్టిన బట్టలనుసహితము పెట్టెతీసి చూపి నారు. దానిని జూచి మన బంధువులలో నొకరు మీరింత యనుకూల మయిన స్థితిలో నున్నారని పరమానందభరితుఁడ నయినాను.

ఆమాటలు విని లోపలిగదిలోఁ బండుకొనియున్న యొక మన లాయన దగ్గుచు లేచివచ్చి "ఓరీ భైరవమూర్తీ ! నీవెప్పడు వచ్చి నావు?" అని యడిగెను.

బైర__ఓహోహో! ప్రసాదరావుగారా! మీరు విజయంచేసి యెన్నాళ్ళయినది?

ప్రసా__రెండు మాసములనుండి యిక్కడనే యున్నాను. బంధువని రాజశేఖరుని జూచిపోదమని వచ్చి యితనిబలవంతమునకు మారు చెప్పలేక యిక్కడఁ జిక్కుపడ్డాను. మన బంధువులలో రాజ శేఖరుఁడు బహుయోగ్యుడు సుమీ ! అని కూర్చుండెను.

రాఘ__తాతగారూ! మీకు రాజశేఖరుఁడుగా రెటువంటి బంధువులు ?

ప్రసా__ఇప్పడు మావాని బంధుత్వము విన్నారుగదా? వీని మేనమామ బావమఱది నాకుమార్తె యత్తగారి సవతితమ్ముఁడు.

ఈ ప్రకారముగా సంభాషణము జరుగుచుండఁగా లోపలినుండి స్త్రీ కంఠముతో "సీతా! సీతా! " అని రెండు మూఁడు పిలుపులు వినఁ బడినవి. అప్పడు రాఘవాచార్యు లందుకొని,"అమ్మాయీ సీతమ్మా" అని పిలచి, లోపల అమ్మగా రెందునకో పిలుచుచున్నారు అని చెప్పెను. అప్పడు నూతివైపు పంచపాళిలోఁ దన యీడుపడుచు లతోఁగూడి గవ్వలాడుచున్న యేడు సంవత్సరముల యీడుగల చామన చాయ పిల్ల పరికిణి కట్టుకొని కుడిచేతిలో పందెము వేయు గవ్వలను, ఎడమచేతిలో గళ్లుగీచిన సుద్దకొమ్మును బట్టుకొని 'వచ్చె వచ్చె నవి కేకలువేయుచు కాళ్ళగజ్జలు గల్లగల్లుమన చావడిలోనుండి పడమ టింటి గుమ్మమువైపునకుఁ పరుగెత్తుకొని వెళ్ళెను. ఆ చిన్నది రాజ శేఖరుఁడుగారి రెండవ కుమార్తె. ఆట్లు వెళ్ళి గుమ్మమున కీవలనే నిలు చుండి సీత-"అమ్మా! ఎందుకు పిలిచినావు?" అని యడిగెను.

49