పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 ఇంతలో నెవ్వరో ముప్పది సంవత్సరముల వయస్సుగల చామనచాయగృహస్థు తెల్లబట్టలు గట్టుకుని కుడిచేతిలోనున్న పొన్నుకఱ్ఱ నాడించుచు, ముందఱ నొకకూలివాడు బట్టలమూటను నెత్తిమీఁదఁ బెట్టుకొని నడువ, నడవలోనుండి చావడిలోనికి చొరవగా నడచి వచ్చి, అచ్చట నిలువబడి, "ఓరీ! రామిగా! మూట లోపలికిఁ దీసికొనిపోయి యెవరినైనఁ బిలిచి రాజశేఖరుఁడుగారు పరుండు గదిలోఁ బెట్టిరా" అని కూలివానిని నియమించి, కూరు చున్నవారి నందఱిని త్రోచుకొనుచు నడుమనుండివచ్చి మున్నెంతో పరిచయము గలవానివలెనే తాను రాజశేఖరురుడుగారిముందఱ తివాచి మీద గూర్చుండెను. రాజశేఖరుఁడుగా రావఱ కెన్నఁడును అతని మొగమే యెఱుఁగక పోయినను పెద్దమనుష్యు డింటికి వచ్చినప్పుడు మర్యాదచేయకపోయిన బాగుండదని కొంచెము లేచి "దయచేయుఁడ"ని చేయి చూపి తాను గొంచెము వెనుకకు జరిగి చోటిచ్చి "యింటివద్ద నందఱును సుఖముగా నున్నారా?" యని కుశలప్రశ్నమునుజేసి మీరెవరని యడిగినఁ దప్పుపట్టుకొందరేమోయని సంశయించుచు వూరకుండిరి. అప్పడా వచ్చినాతఁడు తన పొడుముకాయను రాఘవా చార్యులవంక దొర్లించి యాతని పొడుముబుఱ్ఱను పుచ్చుకొని, మునుపు చేతిలోనున్న పట్టును బాఱవైచి క్రొత్తపట్టు పట్టి సగముపీల్చి రాజశేఖరుడుగారివంకఁదిరిగి "రాజశేఖరుడు గారు నను మఱచిపోయి నట్టున్నారు:" అనెను.

రాజ__లేదు లేదు.ఆని మొగమువంకఁ బాఱఁజూచిరి.

క్రొత్త__ఇంకను నానవాలు పట్టలేదు. మీరు నన్ను పది సంవత్సరముల క్రిందట రాజమహేంద్రవరములో రామమూర్తిగారి యింటి లోపలఁ జూచినారు. నేను వామరాజు భైరవమూర్తిని మన మందఱమును దగ్గఱ బంధువులము. మీ తల్లిగారి మేనత్తయల్లుఁడు మా మేనమామగారికి సాక్షాత్తుగా నొక వేలువిడిచిన మేనత్తకొడుకు. మొన్న మా అన్నగారు సాంబయ్యగారు మీయింట నెలదినములుండి వచ్చిన తరువాత మీరు చేసిన యాదరణనే నిత్యమును సెలవిచ్చుచు

48