పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/45

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వేయించుకొని పరుందురు. మందసమునకును కావడి పెట్టెలున్న గడమంచెకును మధ్యను దక్షిణపు వైపున గదిదొడ్డిలోనికి" బోవు మార్గ మొకటి కలదు. ఆ మార్గమున దొడ్డిలో ప్రవేశించినతోడనే విశాలమయిన చేమంతిమడి యొకటి పచ్చని పూవులతోను మొగ్గల తోను నేత్రోత్సవము జేయుచుండెను. దాని కెడమ ప్రక్కను గొంచెము దూరమున మల్లె తీగలు పందిరిమీద నల్లుకొని యకాల మగుటచే నప్పుడు పుష్పింపక పోయినను పచ్చని కాంతుల నీనుచు మనోహరముగా నుండెను.

రాజశేఖరుడుగారి పడక గది ముందఱి చావడిలో దూలము నకుఁ జిలుకపంజర మొకటి వ్రేలాడఁగట్టఁబడి యుండెను. అందులో నున్న చిలుక సదా "ఎవరువారు" "ఎవరువారు", "పిల్లి వచ్చె కొట్టు కొట్టు", "కూరోయి తోటకూర" మొదలగు మాటలను సహజ మధుర స్వరముతో పలుకుచుండును. ఆ దూలమునకే మఱికొంత దూరమున రామాయణము మొదలయిన తాటాకుల పుస్తకములు త్రాళ్ళతో వ్రేలాడఁ గట్టఁబడియుండెను. ప్రొద్దుననే నిద్రలేచి రుక్మిణి చిలుకను పంజరమునుండి తీసి చేతిమీఁద నెక్కించుకొని "చేతిలో వెన్నముద్ద మొదలుగాగల పద్యములను సహితము నిత్య మును నేర్పుచుండును. ఆ కాలములోఁ దఱుచుగా స్త్రీలు చదువుకొను నాచారము లేకపోయినను, రాజశేఖరుఁడుగారు తన కుమార్తె మీది ముద్దుచేత దానె రుక్మిణికి క్రొత్త పుస్తకమును ఆన్య సాహాయ్యము లేకుండ నర్ధముచేసికొను శక్తి గలుగునంతవఱకు విద్యను చెప్పెను. ఆమె స్వభావముచేతనే తెలివిగలదగుటచే విద్యకూడ దానికి సాయ మయి చిన్నతనములోనే యుక్తాయుక్త వివేకమును జ్ఞానమును కలది యాయెను. తండ్రి యామెకు చదువు చెప్పట చూచి యసూయచేత నిరుగుపొరుగులవారు చాటున గుసగుసలాడుకొనిరిగాని,రాజశేఖరుఁడు గారు ధనికు లగుటవలననేమియు బలుక సాహసింపక పోయిరి. ఆట్లని వారు బొత్తిగా నూరకున్నవారు కారు. పెద్దవాఁడని రాజశేఖ రుఁడుగారు గౌరవముతోఁ జూచుచుండెడి యొక యాప్తబంధుని

43