పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/37

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పేర__ఎందుకు వచ్చిన దయ సంవత్సరమున కొక్కపర్యాయమయినను పట్టుమని పదివరహాల నగచేయించి పెట్టుట లేదు గదా? పూర్వజన్మమునందు చేసికొన్న పాపముచేత నా కీజన్మ మందు ఇటువంటి __

అప్పడు ప్రక్కనునిలుచున్న మఱియొకతె-పేరమ్మా! నీవు వృధాగా లేనిపోని వ్యసనము తెచ్చిపెట్టుకొనుచున్నావు. నీ కేమ యిన అన్నమునకు తక్కువయినదా? బట్టకు తక్కువయినదా? మహారాజు వలె మగఁడు తిన్నగా చూచునప్పడు నగలు లేకపోయిన నేమి? మగనికి ప్రేమ లేకపోయిన తరువాత దిక్కుమాలిన నగ లెందుకు, వట్టి మోతచేటు. చూడు మన గ్రామములో బంగా రమ్మకు శరీరమునిండ నెన్నినగ లున్నవో ఆ నగలపేర్లే కొన్ని నేను వినలేదు. దీపములు పెట్టఁగానే వెళ్ళి దాని మగఁడు బోగము దాని యింటిలోఁ గూరుచుండును. దాని కేమిసుఖ మున్నది? నీ మగండెప్పడును చీఁకటి పడ్డ తరువాత వీధి గుమ్మము దాఁటఁడు.

పేర__నీవు చదువుకొన్న దానవు గనుక, కావలసినన్ని శ్రీరంగనీతులు చెప్పఁగలవు. నీకువలె మాకెవ్వరికిని ఇటువంటి వేదాంతము తెలియదు. నలుగురును నగలు పెట్టుకొని వచ్చినప్పడు, వట్టి మోడులాగున ఎక్కడ కయినను పేరంటమునకు వెళ్ళుటకు నాకు సిగ్గగు చున్నది. జానకమ్మా! నీకు నా మగనివంటి బీదవాడు____

జాన__పేరమ్మతల్లీ నే నేమో తెలియక అన్నాను. కోప పడకు __ అని బిందె ముంచుకుని వెళ్ళిపోవుచున్నది.

తక్కినవా రందఱును నీళ్ళు ముంచుకొని వెనుకనే బయలు దేఱి, "ఓసీ పూజారి పాపమ్మ చెంపకొప్పు పెట్టుచున్నది". "కరణము పెండ్లా మెంత యొయ్యారముగా నడుచునో చూచినావా". "అయ్యగారి రామమ్మ కేమిగర్వమో కాని మనుష్యులతో మాటాడనే మాటాడదే","పుల్లమ్మ పట్టపగలే మగనితో మాటాడునఁట". "కన్నమ్మది కొంచెము మెల్ల కన్ను సుమీ"_ "కరణముగారి సీత

35