పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/36

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మీఁదను దెలియక పొంగిపడుదురు. మా కాలములో నున్న కోడం ట్రికములో ఇప్పుడు సహస్రాంశము లేదు. అత్తమంచియు, వేము తీపును లేదు. ఎక్కడను అత్తలేని కోడలుత్తమురాలు, కోడలులేని యత్త గుణవంతురాలు" అని సణుగుకొనుచు, దోసిలితో నదిలోని నీళ్ళు మూడుసారులు గట్టునపోసి, కొంచెము దూరము పోయిన తరు వాత మరల మూఁడుమాఱులాత్మ ప్రదక్షిణములుచేసి మెట్లెక్కి యదృశ్యురా లయ్యెను,


శేషమ్మ__ (నాలుగువంకలుఁ జూచి వడవడ వడఁకుచు) అమ్మలారా! నేనీలాగున అన్నానని మీ రెవ్వరితోనై ననెదరు సుండీ! మా ఆత్తగారు విన్న నన్ను చంపివేసిపోవును, ఈవరకే నాకు గతులు లేకుండ నున్నవి. ఇది విన్న బొత్తిగానే యుండవు. వెంకమ్మ తల్లీ! ఈ బ్రతుకు బ్రతుకుటకంటె గోదావరిలో పడితే బాగుండునని తోఁచుచున్నది__అని వలవల నేడ్వఁజొచ్చెను,

వెంకమ్మ__ఊరుకో!ఊరుకో! అటువంటి అవాచ్యము లెప్పుడును పలుకరాదు. పడ్డవాండ్రెప్పుడును చెడ్డవాండ్రుకారు-అని యూరడించుచున్నది.

శేషమ్మ__(ఆ మాటలతో దుఃఖము మాని) గోదావరికి వచ్చి చాలాసే పయినదమ్మా! ఇంతసే పేమిచేయుచున్నావని అత్తగారు చంపివేయును. వేగిరము పోవలెను__అని వేగముగా నీళ్ళు ముంచు కొని బిందె బుజముమీఁద నెత్తుకొని గట్టునకు నడుచుచున్నది.

అప్పడే నీళ్ళకు వచ్చిన వారిలో ఇరువదియేండ్ల ప్రాయము గల యొకతె చేరువనున్న మఱియొకతె మెడదగ్గఱకు చేయి పోనిచ్చి, "కాంతమ్మా! ఈ పట్టెడ క్రొత్తగా చేయించుకొన్నావా? నీకేమి? నీవు అదృష్టవంతురాలవు. కనుక తల మొదలుకొని పాదముల వఱకు నీ మగఁడు నీకు నగలు దిగవేయుచున్నాడు."

కాంత__నిన్ననే కంసాలి సుబ్బయ్యచేసి తెచ్చినాఁడు. నాలుగు పేటల పలక సరులు కూడ చేయుచున్నాడు. పేరమ్మా! నీ మగ వికీ నీమీఁద బహుదయ అని విన్నాను. నిజమేకదా!

34