పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/35

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నావుకా'వని తిట్టును. అడిగిన మాటకు మాఱు చెప్పిన "నా మాట కెదురు చెప్పచున్నావా' యని కోసి పెట్టును. బదులు చెప్పక యూర కున్న "మొద్దులాగున మాటాడ వే" మని తిట్టును. ఆమె ముందఱ ఏమి చేసినను తప్పిదమే. 'ఆఁ' అన్న అపరాధము. 'నారాయణా' యన్న బూతుమాట. నేను కాపురమునకువచ్చిన నాలుగు సంవత్సరముల నుండియు వాడుకొనుచున్న ఓటికుండ నాలుగు దినముల క్రింద పగిలి పోయినప్పడు రాయి వంటి క్రొత్తకుండ పగులఁ గొట్టినావని నేటి వరకు తిట్టుచున్నది.

పొట్టి__అత్త పోఁగొట్టినది అడుగోటికుండ, కోడలు పోఁగొట్టినది క్రొత్తకుండ యన్న సామెత వినలేదా?

శేష__నేను పడుబాధ యిప్పు డేమిచూచినారు! నా విధవ వదినెగారు బ్రతికియున్నప్పడు చూడవలెను. నిరుడు అమ్మవారి జాడ్యములో-దైవము కడుపు చల్లగా-ఆవిడ పోయినప్పటినుండి మూఁడు పూఁటలను కడుపున కింత తిన్నగా అన్నము నైన దిను చున్నాను. ఆఁడబిడ్డ జీవించియున్నప్పు డదియునులేదు. ఉన్న మాట చెప్పవలెను. ఎన్ని యన్నను ఇప్పుడు నా అ త్తగారు అన్నము తిన్నగా తినవైతివని తిట్టునుగాని తిని పోతినని తిట్టదు.

పొట్టిది__లోకములో నెటువంటివారును లేకున్న_ పిండి బొమ్మను చేసి పీఁటమీఁదఁబెట్టిన, ఆడుబిడ్డతనమున కదిరదరిపడ్డది -అన్న సామెత యూరకే పుట్టినదా?

ఇంతలో జపము చేసికొనుచున్న ముసలామె కొంతదూరము వచ్చి చెంబులోని లీళ్ళు పాఱబోసి "మీకు మాటల సందడిలో కన్నులు కనఁబడునా? ఈవల స్నానముచేసిన వారున్నారని యయిన లేదు. ఊరకే నీళ్ళు విదలుపుకొందురు. మీఁద మయిలనీళ్ళ పడి స్నానము చేసినముండను చచ్చినట్టు చలిలో మరల మునుఁగు చున్నాను" అని గొణుగుకొనుచు లోతు నీళ్ళలోనికి నడిచి బుడుగు బుడుగున నాలుగు ముణకలు వేసి బయలుదేఱి, మాటాడుకొనుచున్న వారివంక కన్ను లెఱ్ఱచేసి చూచుచు "అమ్మలక్కలు క్రిందును

33