పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పచ్చని దేహము మీఁద అప్పడు కట్టుకొన్న తెల్లనిబట్టయు బంగార మునకు పటిక పూసినట్టు లొకవిధమయిన యందమునే కలిగించు చుండెను. సుందరాంగుల యంగముం జేరినప్పు డేది యందముగా నుండదు? ముక్కున నడ్డబాసయు, చెవుల నీలాలబావిలీలును,చేతుల కంకణములను, మెడలో పట్టెడయును, మొలను వెండి యొడ్డాణమును, కాళ్ళ నందెలను, మట్టెలును, ఆమె యప్పుడు ధరించు కొన్నది. కంకణములకు సాహాయ్యముగా రంగురంగుల గాజులును లక్కపట్టెలును ముంజేతుల నలంకరించుచుండెను. ఈ నగలచే నామె యవయవముల కేమైన శోభ కలిగినదో లేదో కాని యవయవములచే నగలు కొంత శోభగాంచుట మాత్రము కరతలామలకముగాఁ గనఁ బడుచున్నది.

సృష్టిలోని యే పదార్ధమునకును బరిపూర్ణత్వమును దయ చేయనిరీతినే, సర్వసముఁడగు భగవంతుఁడు రుక్మిణి సౌందర్య మందును గొంతకొఱంతను గలిగించినాఁడు కాని బొత్తిగాఁ గలిగిం పక మానినవాఁడు కాఁడు. నిజముగా అది యొక కొఱంతయే యయ్యె నేని యా మెకుం గల లోపమెల్లను మెడ మిక్కిలి పొడుగుగా నుండుట. అయినను ముష్టిసర్వశాస్త్రి యాయవారమునకు వచ్చినప్ప డెల్ల నామె మెడను జూచి సంతోషించి, "మిక్కిలి విడుదగు మెడ శామివి. కులవర్ధని దాని నెఱిగికొడనిరి మిధుల్" అను సాముద్రిక గంథములోని వద్యమును జదివి పోవుచుండును.

అప్పుడొక్క విధవ మొలలోఁతునీళ్ళలో దూరముగా నిలుచుండి నోటిలో నేమేమో జపించుకొనుచు నడుమనడుమ దలయెత్తి సూర్యుని వంకఁ జూచి దండములు పెట్టుచు, దోసిటీలో నీళ్ళుపట్టి సూర్యున కర్ఘ్యము విడుచుచు, అప్పుడప్పుడు ప్రదక్షిణములు చేయు చుండెను. ఆవఱకే వచ్చియున్న కొందఱు స్త్రీలు తమ యిత్తడి బిందెలను నీళ్ళలోఁబెట్టి రేవునకు సమీపముగా నున్న రాళ్ళపయినిలుచుండి నొక్కొక్క మాట చెప్పుకొనుచు బట్టల నుతుకు కొనుచుండిరి; ఒక వృద్దాంగన

26