పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పడుచుందురు. జనులందఱును మిక్కిలి సౌందర్యవతులని యొప్పు కొన్నవారిలో చక్కనివారి నేఱి యామె చెంత నిలిపినచో గురూపురాం డ్రనిపించెడి యామె మనోజ్ఞత నేమని పిలువవలెనో తెలియకున్నది. ఆపూర్వ వర్ణనాసామర్థ్యము గల కాళిదాసాది కవులలో నొకరినైనను బోలఁ జాలని నేను, ఉన్నంత సౌందర్యమును బోధించుపదములు లేనిభాషతోను, పదములు బోధించునంత వఱకైనఁ బూర్ణముగాఁ దెలుపలేని బుద్ధితోను, వర్ణింపఁ బూనుట యామె చక్కదనము యొక్క గౌరవమునకుఁ గొఱంత కలుగఁజేయుటయేగదా? అయినను యోగ్యవస్తువు దొరికినపుడు వర్ణింపక మానుట యుచితము కాదు కాఁబట్టి, యీ సృష్టిలోని వస్తువులతో వేనితోనైనను పోల్చి ఈ పుస్తకముఁ జదువువారి కామె యవయవములయొక్క రూపము వించుక మనస్సునఁ బుట్టింతునన్నను ఆమె యంగముల నెంచి యా వస్తువుల పేరు చెప్పుటకె సిగ్గు వొడముచున్నది. వేయేల? చతుర్ముఖుఁడును ఘణాక్షరన్యాయమునఁ బడిన యామె రూపమునకుఁ దలయూఁచి,తన యపూర్వవస్తు నిర్మాణ చాతురిని మెచ్చుకోకపోఁడని యామెం జూచినవా రెల్లరు నెంచుచుందురు. ఆమె శరీరచ్చాయం జూచిన, ఇఁక నీభూమి మీఁద బంగారమున కేమి చాయ యొక్కువ గలదని తోఁచును: నల్లగానుండు నేని, విండ్లామె కనుబొమలం గొంచెము పోలియున్నవని చెప్పవచ్చును; నేత్రములను జూచిన భాగ్యదేవత వానియందే కాపురము కుదిరినట్టు కనిపించును; కాని, నిపుణముగాఁ బరిశీలించినచో నేదో స్థిరవిచార మొకటి యామె హృదయపీఠమున నెలవుకొని యున్నట్టు ముఖలక్షణములు కొంచెము సూచించుచున్నవి. ఆ విచారమునకుఁ గారణము లేకపోలేదు. ఆమె పెనిమిటి సహవాసదోషముచేత నాఱు నెలల క్రిందటఁ దలిదండ్రు లతోఁ జెప్పక దేశాంతరము లేచిపోయినాఁడు.

ఇప్పుడామెకుఁ బదునాలుగు సంవత్సరముల వయస్సు గలదు. బంగారమునకుఁ బరిమళ మబ్బినట్లు,ఇప్పడిప్పడే యౌవనము తలచూపి యాపె మేనిసోయగమునకు మెఱుఁగు దెచ్చుచున్నది.

25