పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 అంత సిద్ధాంతి యుల్లములో లేని సంతోషమును మోమునఁ దెచ్చిపెట్టుకొని యొక్క చిఱునవ్వు నవ్వి, వినయముతోఁప చేతులు జోడించి రాజశేఖరుఁడుగారి ముఖమున దృష్టి నిలిపి, "తమ మాట చేతనే మా చిన్నదాని బాధ నివారణమయినదే. దాని యదృష్టము బాగుండ బట్టియే దేవరవారి ముఖమునుండి యీ మాట వచ్చినది. ఇప్పుడే తమ సెలవు ప్రకారము బైరాగి యొద్దకు వెళ్ళెదను" అని మనవిచేసి, ప్రయాణోన్ముఖుఁ డయి లేచి నిలువఁబడెను. రాజశేఖరుఁడుగారి యభిప్రాయము కొంచెము తెలిసినతోడనే బైరాగి మహానుభావుఁ డనువారును, మహామంత్రవేత్త యనువారును, వాయుభక్షణము చేయుననువారును, మండువేసవిని పంచాగ్ని మధ్యమునఁ దపస్సుచేయు ననువారును, ఆయి సభ యంతయు ఆతని విషయమైన స్తుతి పాఠములలో మునిఁగి పోయెను. ఒక్కగొప్పవాఁ డొకనిని మంచి వాఁడన్నచో, ఎవ్వని వాక్కు భిన్నముగా లేచును? ఎవ్వని నోరు స్తుతి వాక్యముల కొరకు తడుపుకొనును?

అప్పడు రాజశేఖరుఁడుగారు వీధి వంకఁ జూచి. "ఎవ్వరో స్త్రీలు నీళ్ళకువచ్చి మనలఁజూచి సిగ్గుపడి వెనుకకు నాలుగడుగులు పెట్టి నిలుచుండి యొండొరుల మొగముల వంకఁ జూచుకొను చున్నారు. మన మందఱమును లేచి బైరాగిని జూచి వత్తము రండి" అను మాట తోడనే ఎల్లరును లేచి ప్రయాణిలోన్ముఖు లయి నిలుచుండిరి. వెంటనే యందఱును గలిపి యుత్తర ముఖ ముగా రామపాదముల వైపునకు నడవ నారంభించిరి,



23