పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నన్నను, రోహిణ్యాది నక్షత్రముల యందు బిడ్డను గన్నప్పుడేమి శాంతి తగులునో యెఱుఁగవలెనన్నను, సిద్ధాంతి యొద్దుకురాక సరి పడదు. ఏ కాపువాని పశువు తప్పిపోయినను, ఎవనింట ఏ వస్తువు పోయినను, వచ్చి సిద్ధాంతిగారి నడుగక పోరు.ఇటువంటి సమయము లయం దెల్లను,అతఁడు వీధి నడవలో నేలమీఁద ఇసుక పోసి దానిలో పూచికపుడకతో ఏమేమో బీజాక్షరములను అంకెలును వ్రాసి మీఁది వంక చూచియాలోచించి వచ్చిన కార్య మిదియనియు,కార్య మీ ప్రకార ముగా నగుననియు చెప్పి పంపుచుండును. అతఁడు బల్లి పాటు మొదలైన వాని ఫలములను, శకునములు చూచి సంతానము కలుగు కాల మును కూడ చెప్పచుండును. వేయేల? సిద్ధాంతి యాలోచన లేక యాచేరువ గ్రామములో ఏ శుభకార్యముకాని యశుభకార్యముకాని జరగదు. ఆతఁడు చెప్పెడి జ్యొతిషము తఱచుగా అబద్దమే యగుచు వచ్చినను, అప్పడప్పడు కాకతాళీయముగా కొన్ని సంగతులు నిజ మగుటయుఁ గలదు గనుక జనులాతనిమాట యమోఘమని నమ్ముచునే యుండిరి.

అప్ప డా చావడిలో నున్న వారిలో నెవరో "బైరాగులు భూతవైద్యమునకు గట్టివా" రని మెల్లగా ననిరి. అంతలో రాజ శేఖరుఁడుగారు సిద్ధాంతిగారి వంకఁ జూపు త్రిప్పి "ఔను. బైరాగు లన్నతోడనే జ్ఞప్తికి వచ్చినది. పది దినముల క్రిందట ఈ గ్రామమున కెవ్వఁడో యొక బైరాగి వచ్చినాఁడట! ఆతనికిఁ జూపింప రాదా? గోసాయీలకుఁ బరమహంస క్రియలను వనమూలికలును విశేషముగాఁ దెలిపి యుండును, వాండ్రెట్టి యసాధ్యమైన పీడల నైనను జిటికెలోఁ బోఁగొట్టుదురు" అనిన తోడనే చావడి యంతయు "చి త్తము" "వాస్తవము" "ఆలాగున నవశ్యము చేయ వలసినదే" యను ధ్వనులతో నిండిపోయెను. మాటాడువారు ధన వంతులైనచో, వ్యర్థవచనము నహితము స్తుతియోగ్యము కాక పోదు సుండీ. ఆ మాటలవలన నుత్సాహము కలిగి, రాజశేఖరుఁ డుగా రాబైరాగిని తాము చూడక పోయినను బ్రహ్మ వర్చస్సు కల వాఁడని శ్లాఘించిరి.