Jump to content

పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెడి కడపట దాసియయి తమ కన్నుల ముందఱనే గ్రామములోఁ దిరుగుచుండుటయు, బాల్యదశలోనే భర్తలను బోఁగొట్టుకొన్న భాగ్య హీనురాండ్రైన ముద్దియలు పడు కష్టములును, అట్టివారు దురతిక్రమ ణీయమైన కామబాధకు తాళఁజాలక యింద్రియ చాపల్యమున దుష్ట పురుషుల వలలోబడి పాడగుచుండుటయు, కొందఱు కులము వారికి వెరచి రహస్యముగా శిశుహత్యలు గర్భపాతములు మొదలైన ఘోర పాతకముల కొడిగట్టు చుండుటయు, ప్రతి దినమును కన్నులారఁ జూచి మనసు కరగి యట్టి బాలవితంతువుల దుర్దశను తొలగించుట కేమైనఁ జేయవలయు నని పలు ప్రయత్నములు చేసియు మూఢ శిరోమణులయిన జనుల యొక్కయు నాచారపిశాచావేశసన్యస్త వివేకులై యున్న పండితులయొక్కయు మనస్సులను మళ్ళింపశక్తులుగా విఫల ప్రయత్నులై రాజశేఖరుఁడుగారు కొంతకాలమునకు లోకాంతరగతులయిరి. రాజశేఖరుఁడుగారు కాలముచేసి యిప్పటికి రెండు వందల సంవత్సరములైనను, ఆయన వలన మేలు పొందిన వారి సంతతివా రిప్పటికిని ఆయనను బ్రశంసించుచుందురు. రాజశేఖరుఁడుగారి సంతతి వారుకూడ దేశ మంతటను వ్యాపించి యిప్పుడు పెక్కుచోట్ల గొప్ప స్థితికలవారయియున్నారు.