పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దున, రాజశేఖరుఁడుగారికిని తత్సంతతి వారికిని జ్యోతిషమందు సహిత మపనమ్మకము కలిగెను. రుక్మిణి వివాహకాలమున చేసిన ధర్మములకై చేసిన ఋణములవలని నష్టముల ననుభవించియుండుటం జేసి రాజశేఖరుఁడుగా రిఁక నెప్పుడును పరులకు ఋణపడకూడదని నిశ్చయము చేసికొనిరి. అంతటి నుండియు రాజశేఖరుఁడుగారు మిత వ్యయమునే చేయుచు వ్యర్థదంభమునకై ధనము పాడుచేసికోక, తమ కీశ్వరుఁడు దయచేసినదానితోడనే తృప్తినొందుచు, కలకొలఁ దిని బీదసాదలకు దానధర్మము చేయుచు, కలలో సహితము సత్యమును భూతదయయును తప్పక, "ధర్మోజయతి" యను నీతి వాక్యమును సదా హృదయము నందుంచుకొని సమస్త కార్యముల యందును నీతి పథమును నీఁగకాలంతయు దాటక ఋజువుగాఁ బ్రవర్తించుచు మంచి వాఁడని లోకమునఁ బ్రసిద్ధికెక్కి, పెక్కండ్రు మనుమలను మనుమరాండ్ర నెత్తి సిరియు సంపదయుఁ కలిగి చిర కాలము సుఖింపచుండిరి. ఆయన జీవిత కాలములోనే సుబ్రహ్మణ్యము పిఠాపురపు సంస్థానములో గొప్ప యుద్యోగములుసి కడచే వడ మంత్రియై రాజకార్యములయందును సన్మార్గ ప్రవర్తనము నందును నసమానుఁ డని పేరు పొందెను: అల్లుళ్ళిద్దఱును పెద్దా పురపురాజుగారి యోలగములోఁ గొలువు కుదిరి క్రమ క్రమముగా గొప్పదశను బొంది విశేష ఖ్యాతిని సంపాదించిరి. రాజశేఖరుఁడు గారి కుటుంబములోనివారే కాక యాయన బంధువర్గములో చేరినవారు కూడ అధర్మవృత్తి కొంతకాల మిహలోక సుఖమును గలిగించినను సద్ధర్మవృత్తియే శాశ్వత సౌఖ్యమునకు నిదానమని రాజశేఖరుఁడుగారి వర్తనమువలన నెఱిగి నిరంతరము ధర్మమార్గ ప్రవిష్టులై యుండుచు వచ్చిరి. చిన్నప్పుడెప్పుడో చచ్చిపోయిన మగఁడు పట్టుకొని వేధిం చుచున్నాఁ డన్న సిద్ధాంతి కొమార్తె పెద్దదై బ్రతికియున్న మఱియొక మగఁడు మిక్కిలి మక్కువతో తన్నాశ్రయించి మోహింపఁ జేయఁగా నాతని వెంట నింట దొరికిన సొత్తు నెత్తుకొని లేచిపోయి