పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నల్లరిచేయు చెడువాడుకయును మాన్పబడినవి; కంటితనము గ్రుడ్డి తనము లోనుగాఁగల యంగవైకల్యములచేతఁ బాటుపడ నసమర్థులయిన వారును స్వదోషమువలనఁగాక దైవకృతమువలన హీన దశకు వచ్చిన దరిద్రులును సత్ప్రవర్తనముకలిగి సకల విద్యావిశారదులయియున్న పండితులును భగవద్భక్తులను మాత్రము ధన సత్కారమును బొందిరి. ఈ రెండు వివాహములను విధ్యుక్తముగా జరిగిన పిమ్మట నొక దినమున పెద్దాపురమునుండి వచ్చిన సభికుఁడు రాజశేఖరుఁడుగారి కడకు వచ్చి తాను శీఘ్రముగా వెళ్ళవలసియున్నది గనుక సెలవిచ్చి పంపవలయునని యడిగెను.

రాజ__నా ముద్దు చెల్లించి యీ పది దినములను మీరున్నందునకు మనుగుడుపు లయినదాఁక కూడనుండి నా మనస్సును సంతోష పెట్టి మఱి వెళ్ళవలయును.

సభి__ఇఁక నన్ను మన్నించి విడిచిపెట్టవలయును. మనము బయలుదేఱి యిచ్చటికి వచ్చుటకుముందు మా యూరికి విచ్చేసి యున్న యాచార్య స్వాములవారు శ్రీముఖమును బంపినప్పుడు వెంటనే రూపాయల నియ్యక తిరస్కరించినవాఁడని మా మేనల్లున కేమో యాంక్షపత్రిక వ్రాసి నారనియు,మూడు దినములనుండి మావాని యిల్లెవ్వరును తొక్కి చూడకున్నారనియు, మంగలవాఁడు క్షౌరము చేయుటకుఁగాని చాకలవాఁడు బట్టలుదుకుటకుఁగాని రాకున్నా రనియు, ఇప్పడే యు త్తరము వచ్చినది. స్వాములవారు వెలివేసి నప్పుడు పొరుగువారు నిప్పయినను బెట్టరు; నూతిలో నీళ్ళయినను తోడుకోనియ్యరు.

రాజ__సన్యాసు లెప్పుడును కామక్రోధాదులను వర్ణించి పరమశాంతులై యుండవలసినవారే: ఇంత యల్పదోషమున కంత క్రూరశిక్షను విధింతురా?

సభి__సన్యాసులన్న పేరేకాని వారికున్నంత కోపము ప్రపంచములో నెవ్వరికి నుండదు. ఇదియేమిచూచినారు? ఈ స్వాముల వారే క్రిందటి సంవత్సరము శ్రీకాకుళములో భిక్షకు వెళ్ళిన యింటి