చెప్పుకోవలసిన దేముండును? మేము నిరపరాధులమని చెప్పఁబోము. దేవరవారు దయాపూర్ణ హృదయులు గనుక ఆ దయారసమును మామీఁదఁ బ్రసరింపజేయ దీనత్వముతో వేడుకొనుచున్నాము.
కృష్ణ__నీది యే దేశము? చిన్నప్పటినుండియు నీ వెక్కడ నున్నావు? నీ చరిత్ర మేమి?
నీలా__నా చరిత్రము మిక్కిలి యద్భుతమయినది. నేను దానిని చెప్పుకొనుటకు సిగ్గుపడవలసి యున్నను దేవరయంతటివా రడుగుచున్నారు గాన దాఁచక విన్నవించెదను. ఈవఱకు నేను జేసిన దుష్కృత్యము లన్నిటిని తీఱిక కలిగియున్నప్పడెల్ల నాకు స్మరణకుఁ దెచ్చి నా మనస్సు పలువిధముల నన్ను బాధించుచున్నది; రాత్రులు నన్ను నిద్రపోనీయదు; కలలో సహితము నేను జేసిన ఘోర కృత్యములకు రాజభటులు నన్నుఁ గొనిపోయి శిక్షించుచున్నట్టు కనఁబడి యులికి పడుచుందును. అంతేకాక నాకిప్పుడు వార్ధకము వచ్చియున్నది, కాబట్టి చిరకాలము బ్రతుకఁబోను. ఆ సంగతిని తలఁచుకొను నప్పు డెల్ల నాకు యమభటులవలని భయముచేత దేహము కంపమెత్తు చున్నది. రాజ దండనను పొందినవారికి యమదండన లేదని పెద్దలు చెప్పుదురు. కాబట్టి నేను చేసిన పాపమునకు మీవలన శిక్షను బొంది సుఖింపఁ గోరుచున్నాను.
కృష్ణ__నీ చరిత్ర మంత యద్భుతమయిన దయ్యెనేని, ససాకల్యముగా వినిపింపుము. ఇచ్చట నున్న వారందఱును విని యానందించెదరు.
నీలా__నా జన్మస్థానము కాళహస్తి. నా తల్లిదండ్రు లంతగా ధనవంతులు కాకపోయినను శూద్రకులములలో మిక్కిలి గౌరవమును కాంచిన వంశమునందుఁ బుట్టినవారు. నా తల్లిదండ్రులకు నేనొక్కఁ డనే పుత్రుఁడను గనుక నన్ను వారు మిక్కిలి గారాబముతోఁ బెంచు చుండిరి. నేనేది కావలెనన్నను తక్షణము తెచ్చిపెట్టుచుండిరి. అయి దేండ్లు వచ్చిన తరువాత నన్నొకనాఁడు చదువవేసి, పంతులకు దోవతుల చాపును గట్టఁబట్టిరి. ఆ పంతు లేవిధమునను దనకు జీవనము