పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుబ్ర__ఆది దేవుని యుత్సవము కాదు. శ్రీశంకర భగవత్పాదులవా రీపట్టణమునకు వేంచేసి యుందురు. వారు నెలదినములనుండి పిఠాపురములో నివాసము చేసియున్నారు. నేను బయలు దేఱినప్పుడే వారును ప్రయాణమయి యీ పట్టణమునకు రావలెనని బండ్లు మొదలగు వానిని వాకిట నిలువఁబెట్టి యుండగా జూచితిని.

రాజ__అక్కడ భిక్షలు విశేషముగా జరిగినవా?

సుబ్ర__మిక్కిలి చక్కగా జరిగినవి. వారింటింటికిని శ్రీముఖములను వ్రాసి తలకొక రూపాయవంతున పోగుచేసినారు. అదిగాక యనేక వితంతువులును ధనవంతులను పళ్ళెరములలో పండ్లను రూపాయలను వేసికొనివెళ్ళి పాదపూజకని సమర్పించుకొనుచు వచ్చిరి. వారు సాష్టాంగ నమస్కారము చేసినప్పు డెల్లను స్వాములవారు 'నారాయణ' యనుచు రాగా, చేరువ నుండు శిష్యులు పళ్ళెములోని వానిని జాగ్రత్తచేసి వట్టి పళ్ళెములను వారివి వారికి మరల నిచ్చుచుండిరి. గ్రామమునందలి వైదికు లందఱును జేరి రెండు భిక్షలు చేసినారు; లౌక్యుల యిండ్లలో నాలుగు భిక్షలు జరిగినవి; తక్కిన దినములలో కోమట్లు బ్రాహ్మణ గృహమున భిక్షలు చేయించుచు వచ్చిరి.

రాజ__నీ వెప్పుడయిన వెళ్ళి పీఠదర్శనము చేసినావా?

సుబ్ర__రెండుమూడు పర్యాయములు చేసినాను. పీఠము నిలువెడెత్తున నున్నది; దానినిండను బహువిధములైన విగ్రహములును సాలగ్రామములును నున్నవి. వెండి పువ్వుల పీటమీఁదఁ గూరుచుండి పట్టుశాటి కట్టుకొని స్వాములవా రెప్పడును కుంకుమముతో పీఠపూజ చేయుచుందురు. ఆ పీఠములో స్త్రీ యంత్రముకూడ నున్న దనియు, వారు పూర్వాశ్రమమునందు సహితము స్త్రీ విద్యో పాసకులే యనియు విన్నాఁడను. అది సత్యమౌనో కాదో కాని వారిప్పుడు మాత్రము రాత్రులు చీకటిలో ముసుఁగువేసికొని యొక మనుష్యుని వెంటఁబెట్టుకొని ప్రత్యక్షమయిన స్త్రీయుపాసనము చేయుటకె బయలుదేఱుచుందు రని చూచిన వారే యొకరు నాతో రహస్య