పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దలును తుదకు సుఖముగా నిల్లుచేరుటయుఁ జెప్పి, రాజశేఖరుఁడు గారు కొమారుని నూరార్పఁజొచ్చిరి. ఆ మాటలు ముగియకమునుపే సంతోషము పట్టలేక సుబ్రహ్మణ్యము లోపలికిఁబోయి రుక్మిణి నాలింగ నము చేసికాని యామె తన్నుఁజూచి కంటఁ దడి పెట్టుకోగా నూఱడించెను. ఈవలకు వచ్చిన తరువాత నృసింహస్వామి తన కథను సాంతముగా వినిపించెను. పిమ్మట నందఱును స్నానములుచేసి యుతికిన మడుగుదోవతులు కట్టుకొని భోజనములకడఁ గూరుచుండిరి. భోజన సమయమున సుబ్రహ్మణ్యము పిఠాపురములో రాజుగారి లోపల దొంగల పడుటయు దొంగలను తాను పట్టుకొన్న రీతియు దొరికిన సొత్తులో బైరాగి యెత్తుకొనిపోయిన తమ సొమ్ముకూడఁ గనఁబడుటయు విమర్శన నిమి త్తమయి కృష్ణజగపతి మహారాజుగారి యొద్దకుఁ బంపఁబడిన దొంగలతోఁగూడఁ దన్నిచ్చటకుఁ బంపుటయు జెప్పి, యిక్కడనుండి వెళ్ళినతోడనే తనకొక మంచి యుద్యోగము నిచ్చెదమని పిఠాపురపురాజుగారు వాగ్దానము చేసియున్నారని చెప్పెను. అప్పుడు రాజశేఖరుఁడుగారు "మన యింటికి రాకపోకలు చేయుచు వచ్చిన రామరాజే కృష్ణ జగపతి మహారాజుగా" రని చెప్పి, ఆయన యద్భుత చర్యలను తమకుఁ జేసిన యుపకారమును నామూలాగ్రముగా వినిపించి యాయనను పొగడిరి. ఇంతలో భోజనము లైనందున లేచి చేతులు గడుగుకొని తాంబూలములు వేసికొని తెల్లబట్టలు కట్టుకొని రాజశేఖరుడుగారును సుబ్రహ్మణ్యమును బయలుదేఱి నృసింహస్వామిని వెంటఁ బెట్టుకొని పెద్దాపురమునకు బ్రయాణమయి మయి పోయిరి.

వారు పెద్దాపురము చేరి రాజవీధిని ప్రవేశింపఁగానే యావీధినే దూరమున నొక పల్లకియును దానిముందొక యెనుగును రెండు గుఱ్ఱములను బండిమీఁద నొక భేరియును మఱికొన్ని వాద్యములను వెనుకను స్వస్తివాచక బృందమును దృగ్గోచరమయ్యెను. ఆ యాడంబరము చూచి రాజశేఖరుఁడుగా రాదిన మేదో దేవతోత్సవము కాబోలు ననుకొని, కుమారునివంకఁ జూచి యా యుత్సవము శివుని దయియుండునా విష్ణునిదయియుండునా యని యడిగిరి.