పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదునాల్గవ ప్రకరణము


సుబ్రహ్మణ్యము పిఠాపురమునుండి వచ్చి తండ్రిని దర్శించుట__ శ్రీ శంకరాచార్యులవారి యాగమనము__నీలాద్రిరాజు సభలో తన వృత్తాంతమును జెప్పుట__కృష్ణ జగపతి మహారాజులు గారు రాజశేఖ రుఁడు గారి మాన్యములను విడిపించి యిచ్చుట.

సుబ్రహ్మణ్యము పిఠాపురమునుండి బయలుదేఱి, సొమ్ముతో నీలాద్రిరాజువెంట వచ్చుచున్న రాజభటులతోఁ గలిసి భీమవరమునకు వచ్చి, అక్కడనుండి వారిని పెద్దాపురము పొమ్మని తా నొక్కఁడును తిన్నగా నింటికిఁ బోయెను. అప్పుడు రాజశేఖరుడుగారు భోజనమునకు లేవఁబోవుచుండిరి, కొమారుడు వీధి గుమ్మములో నుండి లోపల నడుగు పెట్టగానే చూచి, అబ్బాయి వచ్చినాడని రాజశేఖరుడు గారు కేకవేపిరి. ఆ కేకతోనే "యేడీ యేడీ" యని లోపలి వారందఱును నొక్కసారిగా పరుగెత్తుకొని వచ్చిరి. ఆందఱి కంటెను ముందుగా సీత పరుగెత్తుకొని వచ్చి అన్నగారిని కౌగిలించుకొనెను. ఇంతలో మాణిక్యాంబ రాగా సుబ్రహ్మణ్యమామెను కౌగలించుకొని, తరువాత తల్లిదండ్రుల కిద్దఱికిని నమస్కారము చేసి వారిచేత నాశీ ర్వాదములను బొందెను. ఈ నడుమ నృసింహస్వామి వచ్చి సుబ్రహ్మణ్యము యొక్క చేయిపట్టుకొని "బావా!" యని పిలువగానే యతడాతని మొగమువంక దిరిగిచూచి మాటరాక యద్భుతపడి చూడ సాగెను. అట్లొక నిమిషము చూచి మఱఁది నాలింగనము చేసి 'యెప్పుడు వచ్చినా' వని యడిగి, మగడు జీవించి యున్నాడన్న వార్త విని సంతోషించుటకు రుక్మిణికి ఋణము లేకపోయెను గదా యని కన్నుల నీరు పెట్టుకొనెను. ఆంతట రుక్మిణి బ్రతికి యుండుటయు దొంగలు కొట్టిన రాత్రి నుండియు నామెకు సంభవించిన యాప