పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కము వెళ్ళునప్పటికి నాయొద్దనున్న రూపాయలన్నియు నైపోయినవి. కాఁబట్టి యక్కడ నా మురుగులను నలువది రూపాయలకు విక్రయించి మునుపటివలె నధిక వ్యయము చేయక యా సొమ్ముతోనే కాశి చేరితిమి. అతఁడు దారిపొడుగునను తాను వాడుకొనుట కేమైనను నిమ్మని యడుగుచు వచ్చెనుగాని నేను రూపాయకంటె నెక్కువగా నెప్పుడును చేతిలోఁబెట్టలేదు. అందుచేత నతఁడు నామీఁద కొఱ కొఱగానుండి తిన్నగా మాటాడక మొగము ముడుచుకొని యొక రీతిగాఁ బ్రవర్తించుచుండెను. మేము కాశి చేరునప్పటికి నావద్ద నాలుగు రూపాయలుండినవి; అవియు బది దినములలోనే వ్యయమయు పోయినవి. తరువాత నూటయేఁబది రూపాయలకు నా కంటెను సహితము కాశిలో నొక వర్తకున కమ్మివేసితిని. మేము మొట్టమొదట ననుకొన్నట్లు బంగారము చేయుటకు మాఱుగా మును పున్న బంగారమును సహితము పోగొట్టుకొనుచుంటిమి. శేషా చలము భోజనమునకుఁ దడవుకోనక్కఱ లేకుండా నా సొమ్ముతో నిర్విచారముగాఁ గాలక్షేపము చేయుచు, అంతతోనైనఁ దృప్తినొంది యుండక యెుకనాఁడు నాయొద్దకు వచ్చి తన కేబది లేదోపనికిఁ గావలసివచ్చినవి కాబట్టి యిమ్మని యడిగెను. నే నియ్యనని నిర్ధాక్షిణ్యముగాఁ దెలియఁజెప్పితిని. దానిపైని నాతో పోట్లాడి "కృతఘ్నుఁడ"వని నన్నుఁ దిట్టి విస్తరిలో వడ్డించిన యన్నమును సహితము తినక పగలు రెండు జాములవేళ లేచిపోయెను. నేను తరువాత నాలుగు మాసములు కాశిలో నివాసముగా నుండి, యింటి మీద బుద్ధి పుట్టినందున బయలుదేఱి వచ్చుచు నిన్నయుదమున మీ రిక్కడనున్న సంగతి తునిలో విన్నాను."

అని నృసింహస్వామి తన వృత్తాంతమును జెప్పినమీఁదట రాజశేఖరుడుగారు శేషాచలము చేసిన దురాగతము నాతనితోఁ జెప్పి భోజనమయిన తరువాత పక్కవేయించి యాతఁడు పరుండి నిద్ర పోయినమీఁదట తామును పరుండిరి.