పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వామి లేచి కాళ్ళు కడుగుకొని భోజనము చేయుచు తాను కాశీయాత్ర వెళ్ళుటయు దారిలో తన మిత్రుఁడు తన్ను విడిచి వచ్చుటయు మొదలుగాఁగల సంగతి నీప్రకారముగాఁ జెప్పనారంభించెను:

"నాకు చిరకాలమునుండి కాశీయాత్ర చేసిరావలెనని మనసులో కోరికయుండెనుగాని తగిన తోడు లేకపోవుటచేత నా కది దుర్లభమని యా తలఁపు విడిచిపెట్టితిని. ఇట్లుండఁగా నొకనాఁడు చామర్తి వారి చిన్నవాడు శేషాచలము నాయొద్దకు వచ్చి యెవ్వరితోను జెప్పనని నాచేతఁ తనచేతిలో చేయి వేయించుకొని రహస్యముగాఁ దనకు హిమవత్పర్వతముదగ్గఱ తపస్సుచేసి స్వర్ణవిద్యను గ్రహింపవలెనని కోరిక గలదనియు, నేనుకూడ వచ్చిన పక్షమున తనతో దీసికొని వెళ్ళి యా విద్య నుపదేశించెదననియు, మనమిద్దఱమును బంగారము చేయు యోగమును గ్రహించినమీఁదట మరల నింటికి వచ్చి కావలసి నంత బంగారమును జేసికొని కోటీశ్వరులము కావచ్చుననియు చెప్పెను. ఆ మాటలమీఁద మనస్సులో నాకును మిక్కిలి యాశపుట్టి, తప్పక బయలుదేరి సాధ్యమయినయెడల కాశీయాత్రకూడఁ జేసుకుని రావలెనని నిశ్చయించితిని. తరువాత మేమిద్దరమును బాఠశాలలో రహస్యముగా బ్రయాణము సంగతిని మాటాడుగొనుచు, బయలుదేఱ వలసిన దినము నిర్ణయము చేసికొని యాలోపుగానే బట్టలు మొదలగు వాని నొకచోట పదిలముగాఁ జేర్చి ప్రొద్దుననే భోజనముచేసి శాస్త్రుల వారియొద్దకుఁబోయి కావ్యములు చెప్పించుకొని వచ్చెదమని చెప్పి తిన్నగా నడచి మఱునాఁడు ప్రాతఃకాలమునకు పెద్దాపురము చేరితిమి. మేము బయలుదేఱిన నాఁటి క్రిందటిదినము నేను పుట్టినదినముగనుక నాఁడు మావాండ్రు పండుగుచేసి నాకు బంగరు కంటెయు మురుగులును బెట్టిరి. ఆ రాత్రి నేను మా తండ్రిగారి పెట్టెను మాఱు తాళపు చెవితో తీసి యందులో నున్న యేఁబదినాలుగు రూపాయలను మూట గట్టుకొని, మఱునాఁ డానగలతోను సొమ్ముతోను మేము గ్రామము విడిచితిమి, శేషాచలము తనతో మూడురూపాయలను మాత్రము పట్టుకొని వచ్చినాడు. త్రోవపొడుగునను మా యిద్దరకుఁ గావలసిన కర్చును నేనే పెట్టుచు వచ్చితిని. మేము జగన్నాధమును దాటి కట