పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేయించక పోయినందునను జ్వరబాధితుఁ డయి యుండఁగా భూత వైద్యులాతనిని పలుమాఱు స్నానములు చేయించుచు వచ్చినందునను వాయువుచేసి యాపిల్లవాఁడు కాలధర్మము నొందెను. అదిమొదలు కొని మా తండ్రి ప్రయోగములుచేసి యందఱను జంపుచున్నాడన్న నమ్మక మొకటి యూరనందఱికిని గలిగెను. ఆ నమ్మకమునకుఁ దోఁడు మునుపెప్పుడో గ్రామమున చచ్చినవారు తాము ప్రయోగము చేతనే చచ్చినామనియు, మీరు నిజమును కనుఁగొనలేక రోగమని భ్రమపడి తమ్ముఁ బోఁగొట్టుకొన్నా రనియు చెప్పుకొని యేడ్చు చున్నట్టు గ్రామములోని ముసలి మండలిద్దరు ముగ్గురు రోదనముల కారంభించిరి. ఆ కాలములో కామేశ్వరి మొదలైన యిల వేల్పులు గృహములోని విధవల కావేశమై యెవరికైన రోగము వచ్చినప్పడు ప్రయోగ మని యొకటి రెండుచోట్ల పలుకుచు వచ్చెను. ఈ యన్నికారణములచేతను గ్రామములో నెవ్వరి కేవిధ మయిన జబ్బు కలిగినను, అది యంతయు మా నాయన చేసిన ప్రయోగముచేతనే కలిగినదని జనులు భ్రమపడుచుండిరి. తానే దోషము నెఱుఁగనని మా నాయన యెన్ని విధముల ప్రమాణములు చేసి చెప్పినను. ఎవ్వరు నాతని మాటలను విశ్వసించినవారు కారు. జనుల పిచ్చి యేమందును? గ్రామములో మరణము నొందిన వారందఱును మా నాయనచేసిన ప్రయోగముచేతనే పోయి రని దృఢముగా నమ్మిరి; వ్యాధిగ్రస్తులైన వారందఱును మా నాయనయొక్క మంత్రశక్తిచేతనే బాధపడుచున్నారని తలఁచిరి. కాబట్టి యెల్లవారును కొంత కాలమునకు మా నాయనను గ్రామమున కొక మృత్యుదేవతనుగాఁ జూచుకొనుచుండిరి. మా నాయన పొడ గనఁబడినపుడెల్లను గ్రామములోని యాఁడువారు నెటి కలు విఱిచి తిట్టఁజొచ్చిరి; మగవాండ్రు కొఱకొఱలాడుచు మునుపటివలె మాటాడక యాతఁడు కనఁబడినపు డెల్లను తప్పించుకొని పెడదారిని తొలగి పోవుచుండిరి. ఇరుగు పొరుగుల నున్నవారు నిప్పు సహితము పెట్టమానివేసిరి; ఏ వస్తువు