Jump to content

పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాని యింటికడకుఁ జేరి నిలిచితిని. అప్పుడు న న్నక్కడ నిలువఁ బెట్టి మా నాయన కాలికి బందము వేసికొని కొబ్బెర చెట్టున కెగఁ బ్రాకి యొక కఱ్ఱతో దాని మొవ్వును చితుకఁబొడిచి యందు నేను దెచ్చిన బియ్యమును కడుగును బోసి చెట్టు దిగివచ్చి యా యర్ధరాత్ర మప్పుడు మరల నన్నుఁ దీసికొని యింటికి వచ్చి యారాత్రి సుఖ నిద్రచేసెను. మఱునాఁ డతఁడు తన్నుఁ జూడవచ్చిన వారితోనెల్ల “యిూడిగవాఁడు కొబ్బెరకాయ లియ్యకపోయినందున వానిచెట్టునకుఁ బ్రయోగము చేసితి" నని చాట మొదలుపెట్టెను. అందుకు దృష్టాంతముగా నాఁడు మొదలుకొని మొవ్వవాడి క్రమక్రముగా ఆకు లెండి పోయి నాలుగైదు దినములలో చెట్టు చచ్చెను. "తనకు కొబ్బెర కాయ లియ్యనన్న కోపముచేత బాపనవాఁడు నిష్కారణముగా నా కొబ్బెరచెట్టును దయ్యాలు పెట్టి చంపినాఁ" డని యూర నెల్లవారి తోను జెప్పుకొని యీడిగవాఁ డేడువ నారంభించెను. ఆ వార్త శీఘ్ర కాలములోనే చేరువ గ్రామములకును ప్రాకెను. అందుమీద నెల్ల వారికిని మా నాయన మీఁద నొక విధమయిన యసూయ కలిగెను.

ఆ పిమ్మట గ్రామములో నొకరికి రోగము వచ్చినప్పడు మా నాయన ప్రయోగము చేసినాఁడేమో యని కొందఱి కనుమానము కలిగెను. అందుచేత గ్రామములోనివారు తమ యింట రోగాదికము వచ్చినప్పుడు మునుపటంత తఱచుగా మా నాయనను పిలుచుకొని పోవ మానివేసినారు కాని యాతనిని పిలువకపోయిన నేమిచేసిపోవునో యని మనస్సులలో భయపడుచుండిరి. ఈరీతి నుండఁగా నొక కోమటివాని పిల్లవానికి రోగము వచ్చినప్పుడు, వాని తల్లియు ముత్తవయు వెళ్ళి సోదె యడుగంగా పేరంటాలు గుడియొద్దనున్న మాలది యా చిన్నవానికి గ్రామములోనివారే యొకరు ప్రయోగము చేసినారని చెప్పెను. అందుమీద వారిద్దఱు నేడ్చుచు నింటికివచ్చి యావత్సమాచారమును మగవాండ్రకు వినిపింపఁగా వాండ్రా ప్రయోగము చేసినవాఁడు మా తండ్రియే యని నిశ్చయించి భూతవైద్యులను పిలిపించి పలువిధముల పాట్లుపడిరికాని వచ్చిన రోగమునకు చికిత్స