పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎవ్వరి యింట నెవ్వరికి కొంచెము జ్వరము వచ్చినను మా నాయనను పిలిచి తీర్థమిప్పించుచుండిరి; ఎవ్వరికి కాలు కాసంత నొచ్చినను మా నాయనచేతనే రక్షరేకు కట్టించుకొనుచుండిరి; ఎవ్వరికి కొంచెము గాలిసోఁకిన దన్నను మా నాయననే పిలుచుకొని పోవుచుండిరి. ఎవ్వరు కొంచెము జడిసికొన్నను, మా నాయనచేతనే విభూతి పెట్టించు చుండిరి. వేయేల? చుట్టుపట్ల నేగ్రామములో నెవరికే జబ్బు వచ్చినను మా నాయనను పిలువని స్థలము లేదు. ఈ ప్రకారముగా జరుగుచుండుటచేత నెల్లవారును సమస్త వస్తువులను మా యింటికిఁ దెచ్చి భక్తి పూర్వకముగా సమర్పించుచుండిరి; ఎవ్వరి యింట శుభకార్యము జరిగినను ముందు కట్నము మా నాయనదిగానే యుండెను.

ఈ విధముగాఁ గొంతకాలము జరిగిన పిమ్మట నొకనాఁడు ప్రాతఃకాలమున మా నాయన వీధిలో నడచుచు, ఒక యీడిగవాని వాకిట కాయల గెలలతో నిండియున్న యొక కొబ్బరి చెట్టును జూచి ఆ యింటి వానిని పిలిచి తనకు నాలుగు లేఁత బొండములు పంపుమని యడిగెను. వాఁడు కొంచెము పొగరుఁబోతు గనుక సొమ్ము తెచ్చికొన్నచో కాయలనిచ్చెద నని మాఱుపలికెను. అందుమీఁద మా నాయన కోప దృష్టితో వానివంక నెఱ్ఱపాఱచూచి కాయల నియ్యవా యని గద్దించెను. నే నియ్యను, నన్నెఱ్ఱపాఱిచూచి యేమిచేసెదవో చూతమని వాఁడును వెనుకతీయక గట్టిగాఁ జెప్పెను. ఱేపీపాటికి నీ చెట్టేమగునో చూచుకొమ్మని తల యూఁచుచు మా తండ్రి యింటికిఁ బోయెను. దయ్యాలు పెట్టి చంపినప్పటిమాట చూచు కొంద మని వాఁడును లోపలికి నడచెను.

ఆ రాత్రి రెండు జాములవేళ మా తండ్రి గాఢ నిద్రలోనున్న నన్ను లేపి నాయుత్తరీయపు చెంగున గిద్దెడు బియ్యము మూటగట్టి కడుగుచెంబు చేతికిచ్చి తనతోఁగూడ రమ్మని చీకటిలో నన్ను దీసికొనిపోయెను. నేనును కన్ను కనబడని గాఢాంధకారములో నిశాసమయమున దారి తడవుకొనుచు మా తండ్రితో నీడిగ