పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తోను జెప్పకుండ నుండవలెనని మార్గము పొడుగునను తలఁచుకొని వచ్చితిని గాని, అమ్మను జూచిన తోడనే మనసు పట్టలేక లోపలినుండి దుఃఖము పొంగివచ్చి కౌగలించుకొని నా సంగతి జెప్పివేసితిని."

అని రుక్మిణి చెప్పిన తరువాత రాజశేఖరుడుగారు కొమార్తె యొక్క బుదికిని సాహస కార్యమునకును సంతోషించి యామెను కౌగలించుకొని మిక్కిలి గారవించెను. రుక్మిణియొక్క యీ చరిత్రమును విన్నవా రెవ్వరైనను, ఉన్నయూరిలో సహితము గడప దాఁటి పొరుగు వీధికైన నెప్పుడును పదచలనముచేసి యెఱుఁగనంత సుకుమారిగాఁ బెరిఁగిన పదునాలుగేండ్ల ప్రాయముగల ఒక్క ముగ్ధబాలిక అంతటి ధైర్యమును పూని సమయోచిత బుద్ధితో మంచి యుపాయము నూహించి పరుల కెవ్వరికిని భేద్యముకాని మాఱు వేషమును ధరించి లోకానుభవమువలన నాఱితేఱిన ప్రౌఢాంగనలకు సయితము కష్టసాధ్యమయినరీతిని ప్రచ్ఛన్నముగా నుండఁ గలిగిన దన్నవార్త నమ్మశక్యము కాకున్న దనవచ్చును. ఎవరు నమ్మినను ఎవరు నమ్మక పోయినను వాస్తవమును మఱుగు పఱచక చెప్పుట చరిత్రకారునికి విధాయక కృత్యము గనుక, జరిగిన సంగతినేమో జరిగినట్టు చెప్పుచున్నాను. పురాణ గాధలయందువలె మనుష్యులు లేడి రూపమును ధరించినారని కాని, పురుషులు కేవల స్త్రీలుగానే మాఱినారని కాని అసాధ్యమయిన సంగతి యిందేదియుఁ దెలుపఁ బడలేదు. ఆమె కిట్టి యద్భుత విధమున బ్రవర్తింపనేర్పినది యామె నాశ్రయించియున్న సరస్వతియే కాని స్వశక్తికాదు. విద్యా ప్రభావము నెఱిగినవా రెవ్వ రిట్టిదొక ఘనకార్యమని యాశ్చర్యపడుదురు?